ఇటీవల మన తెలుగు సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.
మొదటగా కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్టీఆర్ అభిమానులు ఈ పద్ధతిని మొదలు పెట్టి ఆది, సాంబ మొదలగు చిత్రాలను ప్రత్యేక ప్రదర్శనలు జరుపుకున్నారు. అదే సమయంలో మెగా అభిమానులు మగధీర సినిమాను కూడా ప్రత్యేకంగా ప్రదర్శించారు.అయితే ఆ సినిమాలను ఏదో అభిమానుల ఆనందం కోసం ఒకటి లేదా రెండు షోలు మాత్రమే వేసుకున్నారు తప్ప, ఒక కొత్త సినిమా విడుదల లాగా విస్తృత స్థాయిలో రిలీజ్ చేయలేదు.
ఆగస్ట్ నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమా స్పెషల్ షోలు వేసుకుని భారీ స్థాయిలో సంబరాలు జరుపుకున్నారు. అందుకు బదులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ పుట్టినరోజు నాడు జల్సా సినిమాకు స్పెషల్ షోలు వేయడమే కాకుండా ఏకంగా స్పెషల్ షోల సంఖ్య, మరియు కలెక్షన్లలో రికార్డు నెలకొల్పారు.
ఇక తెలుగు సినిమా అగ్ర హీరోలలో ఒకరు బాలయ్య. ఇప్పుడు ఈ క్రమంలో రెండు దశాబ్దాల కిందటి ఆయన బ్లాక్ బస్టర్ సినిమాను నందమూరి అభిమానులు రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బాలయ్య చిత్రాల్లో దర్శకుడు వి వి వినాయక్ తో చేసిన చేసిన మాస్ సినిమా చెన్న కేశవ రెడ్డి సినిమా ఒకటి. ఇప్పుడు ఈ సినిమా స్పెషల్ షోల కోసం బాలయ్య అభిమానులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ మద్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన స్పెషల్ షోలు భారీ వసూళ్లతో అదరగొట్టాయి. మరి నందమూరి అభిమానులు కూడా తమ అభిమాన హీరో బాలయ్య నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమా ద్వారా ఆ రికార్డులను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు.
2002 లో రిలీజ్ అయ్యిన చెన్నకేశవరెడ్డి చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ రీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలో ఈ రీ రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నారట. కేవలం యూఎస్ లో 30కి పైగా థియేటర్లులో షోలు ప్లాన్ చేసుకున్నారట. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పెషల్ షోలు సెప్టెంబర్ 24, 25వ తేదీలలో ప్లాన్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు.