నాని నటించిన దసరా సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. విజువల్స్ చూస్తుంటే ఓ చిన్న పల్లెటూరిలో ఉన్న వ్యక్తి తన ప్రజల కోసం పోరాడే కథలా ఈ సినిమా కనిపిస్తోంది. టీజర్ లో పుష్ప పోలికలు బాగానే కనిపించినా.. ఎమోషన్ ని మాత్రం తమదైన శైలిలో చూపించారు.
బొగ్గు కుప్పలతో చుట్టుముట్టిన వీర్లపల్లి అనే చిన్న గ్రామాన్ని పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమవుతుంది. నాని పాత్ర వాయిస్ ఓవర్ ద్వారా గ్రామ ప్రజలు మద్యానికి బానిసలు కాదని, తాగడం వారికి ఒక సంప్రదాయమని తెలియజేశారు.
టీజర్ చివర్లో నాని.. ” నీ యవ్వ ఎట్లైతే గట్ల..గుండు గుత్తగా లేపెద్దం” అనడం మనం చూడొచ్చు. అలాగే చేతిలో గొడ్డలితో స్లో మోషన్లో వెళ్తుండటాన్ని కూడా మనం చూడవచ్చు. టీజర్ చివరి షాట్ లో నాని తన బొటనవేలు అంచును కట్ చేసి రక్తాన్ని తీసి నుదుటి పై పూసుకోవడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, సాయికుమార్, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు. తెలంగాణలోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
గతంలో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార తరహాలోనే దసరా సినిమా కూడా ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నాని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పేరుని ప్రేక్షకులు గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. సినిమా బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉండడంతో పాటు మాస్ ఎలిమెంట్స్ తో కేజీఎఫ్ 1, పుష్ప సినిమాల లాగా దసరా కూడా విజయం సాధించే అవకాశం ఉంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం 2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.