మార్చి 30న విడుదలైన నాని దసరాకు పాజిటివ్ రివ్యూలు, మంచి టాక్ రావడంతో ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్ డే, వీకెండ్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా కోసం నిర్మాతలు, హీరో నాని చాలా ప్రమోషన్స్ చేయడంతో నాని కెరీర్లోనే ఈ సినిమాకు బిగ్గెస్ట్ హైప్ వచ్చింది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన దసరా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2023 ఏప్రిల్ 27న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. థియేటర్లలో ఈ సహజమైన, పల్లెటూరి యాక్షన్ డ్రామాను మిస్సయిన వారు వచ్చే గురువారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. తెలుగు, తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.
కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టిల మంచి సపోర్ట్ తో నాని కనబర్చిన సూపర్బ్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గ్రామీణ తెలంగాణను సహజంగా చిత్రీకరించగా.. అంతే ప్రబావ వంతంగా తెరకెక్కించిన ఎమోషనల్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.
నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయికుమార్, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం వీర్లపల్లిలో నివసించే ముగ్గురు చిన్ననాటి స్నేహితులైన ధరణి, సూరి, వెన్నెల ల కథను చూపిస్తుంది.