గత కొన్ని నెలలుగా ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుతో పాటు, వరుస అవార్డుల పరంపర వలన అన్ని వైపులా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆస్కార్ అవార్డ్స్ లో నాటు నాటు పాట ఘనవిజయం సాధించడం టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ కమ్యూనిటీకి కూడా విపరీతమైన ఆనందాన్ని కలిగించింది అనే చెప్పాలి.
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు అయిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ వంటి వారంతా ప్రచారంలో, ఆ తర్వాత జరిగిన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనగా, ఈ జాబితాలో ఒకరి పేరు మాత్రం కనిపించలేదు. అది మరెవరో ఆర్ ఆర్ ఆర్ సినిమా యొక్క నిర్మాత అయినా డీవీవీ దానయ్య గారిదే.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ ప్రచారం సమయంలో, అలాగే అవార్డుల వేడుకలకు కూడా నిర్మాత దానయ్య గైర్హాజరయ్యారు. ఆస్కార్ కు ముందు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని దానయ్య గతంలో చెప్పారు. ఆస్కార్ ప్రచారం కోసం దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని, అయితే ఇతర రాజమౌళి చిత్రాల నిర్మాతలకు వచ్చినంత భారీ లాభాలు ఈ చిత్రంతో తనకు రాలేదని, అందువల్లే అంత ఖర్చు పెట్టడం సాధ్యం కాదని ఆయన అంగీకరించారు.
ఆస్కార్ ప్రచారానికి రాజమౌళి చేసిన ప్రతిపాదనను దానయ్య తిరస్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటీవలి కాలంలో బలమైన వార్తలు వచ్చాయి. ఆస్కార్ ప్రచారానికి తాను ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని ఈ నిర్మాత ఎట్టకేలకు ధృవీకరించారు. ఈ సినిమాకి వచ్చిన గుర్తింపు, అందరికీ వచ్చిన పేరు ప్రఖ్యాతులతో తాను సంతోషంగా ఉన్నా ఆర్థికంగా మాత్రం తనకు పెద్దగా లాభాలు రాలేదని దానయ్య పరోక్షంగా చెప్పారు.