అక్కినేని నాగచైతన్య, ఆయన సోదరుడు అఖిల్ ఇద్దరూ తమ తమ సినిమాలైన ‘ఏజెంట్’, ‘కస్టడీ’ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని సోదరులకు ఇది చాలా కీలకమైన సమయం, ఇప్పుడు ఈ అన్నదమ్ములు హిట్ అందుకోవడంలో సఫలం అవుతారా లేదా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ డీసెంట్ సక్సెస్ అందుకున్నారు కానీ అది ఆయన స్టార్ హీరోగా నిలబెట్టే స్థాయికి సరిపోకపోవడంతో తన తదుపరి సినిమా అయిన ఏజెంట్ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే ఎందుకో ఏజెంట్ టీం ఈ సినిమా పై సరైన బజ్ పెంచడంలో విఫలం అయింది. కాగా ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ ఏజెంట్ తో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలి, లేకపోతే ఆయన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఇక నాగ చైతన్య ఇటీవలే చేసిన థ్యాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవ్వడంతో ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అక్కినేని సోదరులకు ఇది కీలక సమయం కావడంతో వారు విజయవంతం అవుతారో లేదో వేచి చూడాలి.
ఏజెంట్ చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లో మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది. సాక్షి వైద్య కథానాయికగా కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
ఇక నాగ చైతన్య విషయానికి వస్తే వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న కస్టడీ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్నారు. నాగచైతన్య, కృతి శెట్టి కాంబినేషన్లో ఇప్పటికే ‘బంగార్రాజు’ అనే బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లెజెండరీ తండ్రీ కొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీత దర్శకులు. సంగీత దర్శకులుగా వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం.