పాత సినిమాలను 4కె రిజల్యూషన్ లో రీ రిలీజ్ చేయడం ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ట్రెండ్ గా మారింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా ఈ వారం థియేటర్లలోకి రాగా, ‘ఖుషి’ 4కె వెర్షన్ ను ఆయన అభిమానులు, ప్రేక్షకులు కూడా విజయవంతంగా స్వీకరించారు.
‘తొలిప్రేమ’ నిర్మాత కూడా ఆ సినిమాని ఇదే తరహాలో మళ్ళీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
2023 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా 4కె ప్రింట్ తో ‘తొలిప్రేమ’ థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే పనులు మొదలయ్యాయట. త్వరలోనే దీనికి సంభందించిన అధికారిక ప్రకటన చేస్తారు.
కరుణాకరన్ దర్శకత్వంలో 1998లో విడుదలైన తొలిప్రేమ ప్రేమకథల్లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి లవర్స్ గా నటించారు. దేవా అందించిన సంగీతం భారీ విజయం సాధించింది. అప్పట్లో ‘ఈ మనసే సే సే’, ‘ఎమీ సోదర’, ‘గగనానికి ఉదయం ఒకటే’ వంటి పాటలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.
బాలు పాత్రలో పవన్ కళ్యాణ్ నటన, ఒక మధ్యతరగతి కుర్రాడి స్వభావాన్ని, కుటుంబం, స్నేహితులతో గడిపే క్షణాలని దర్శకుడు బాగా చూపించారు. అసాధారణమైన పాటలు మరియు అద్భుతమైన లవ్ ట్రాక్ తో పాటు, తొలిప్రేమలో హృదయాన్ని తాకే సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది, అందుకే ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు నచ్చుతుంది.
తొలిప్రేమ చిత్రానికి తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. మరియు ఆయన నటించిన ఐకానిక్ చిత్రం ఖుషి రీ-రిలీజ్ అయ్యి అద్భుతమైన స్పందనను పొందింది.