ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 30 సినిమా పై తాజాగా ఒక్కసారిగా మార్కెట్ లో భారీ బజ్ ఏర్పడింది. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని, 2024 ఏప్రిల్ 5న విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుందని కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం చిత్ర బృందం ఓ స్టార్ హీరో కోసం వెతుకుతోందనే పుకార్లు మొదలయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులో ప్రతినాయకుడిగా చియాన్ విక్రమ్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ తో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ విలన్ పాత్రకు పరిశీలనలో ఉన్నారని సమాచారం.
ఇక పోతే సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే ఆదిపురుష్ లో ప్రభాస్ కు వ్యతిరేకంగా విలన్ పాత్రలో నటిస్తుండగా, విజయ్ సేతుపతి 2021 టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఉప్పెనలో నెగెటివ్ రోల్ పోషించారు. ఒక వేళ విక్రమ్ గనక ఈ ప్రాజెక్టుకు సైన్ చేస్తే ఈ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో క్రేజ్ వస్తుంది. ఎందుకంటే ఇద్దరు యాక్టింగ్ పవర్ హౌస్ లు అయిన ఎన్టీఆర్, విక్రమ్ లను ప్రేక్షకులు తెర పై చూస్తారు.
ఎన్టీఆర్ – కొరటాల శివ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వీడియో గత ఏడాది విడుదల కాగా, అప్పటి నుంచి ఎన్టీఆర్ 30 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించనున్నారు.