మెగాస్టార్ చిరంజీవి తన నటనా చాతుర్యం, బాక్సాఫీస్ రికార్డులకే పరిమితం కాకుండా ఐ, బ్లడ్ బ్యాంక్ సేవలు వంటి ఎన్నో దాతృత్వ కార్యక్రమాలకు కూడా పేరు పొందారు. ఎంతో మంది ఇండస్ట్రీ వాళ్లు కష్టకాలంలో ఉన్న సమయంలో వారికి, అలాగే తన అభిమానులకు కూడా విరాళాలు అందించి తన మెగా హృదయాన్ని ఆయన చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దానగుణంతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.దేవరాజ్ కు రూ.5 లక్షల విరాళం అందజేశారు. దేవరాజ్ పరిస్థితిని చిరంజీవి తన టీం ద్వారా తెలుసుకున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్నో సినిమాలకు పనిచేసినా తన ఆర్థిక కష్టాల గురించి చెప్పుకొచ్చారు ఈ సీనియర్ టెక్నీషియన్. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంజిఆర్, రజినీకాంత్, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున .. ఇలా ఎంతోమంది హీరోలతో దేవరాజ్ పనిచేశారు. తెలుగు, తమిళ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్నారు.
దేవరాజ్ పరిస్థితి చిరంజీవిని కదిలించి వెంటనే అతని కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారట. దేవరాజ్ చిరంజీవితో కలిసి నాగు, రాణికాసుల రంగమ్మ, పులి బెబ్బులి సహా పలు చిత్రాలకు పని చేశారు.
మరో వైపు తన తాజా చిత్రం వాల్తేరు వీరయ్యతో భారీ బ్లాక్ బస్టర్ అందించిన చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కాగా చిరంజీవి చెల్లెలి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించనున్నారు.