మెగాస్టార్ చిరంజీవి కేవలం ఒక స్టార్ గానో, నటుడిగానో పేరు తెచ్చుకోవడమే కాకుండా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడంలో ముందుంటారనే విషయం తెలిసిందే. ఎంతో మంది ఆర్టిస్టులకు, తన అభిమానులకు సాయం చేస్తూ చిరంజీవి తన పెద్ద మనసును చాలాసార్లు చాటుకున్నారు. తాజాగా చిరంజీవి ఓ ప్రముఖ నటుడికి సాయం చేసి ప్రాణాలు కాపాడారు.
తమిళ నటుడు పొన్నాంబళం గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో భాదపడుతున్న సంగతి తెలిసిందే. పొన్నాంబళం తనకి ఆర్థిక సాయం అందించాలని కూడా గతంలో చాలామందిని విజ్ఞప్తి చేశారు. పొన్నాంబళంకి పలువురు ఆర్థిక సాయం అందించినప్పటికీ అది ఆయన వైద్య ఖర్చులకు సరిపోలేదు. ప్రస్తుతం పొన్నాంబళం పూర్తిగా కోలుకుని నార్మల్ అయ్యారు.
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారివల్లే తనకు వైద్యం అందింది అని.. ఆయన చేసిన సాయాన్ని జీవితాంతం మరచిపోలేను అని పొన్నాంబళం అన్నారు. తన స్నేహితుడి ద్వారా పొన్నాంబళం చిరంజీవి ఫోన్ నంబర్ తీసుకున్నారట ‘అన్నయ్య నేను పొన్నాంబళం. నా ఆరోగ్యం బాగాలేదు.. వీలైన సాయం చేయండి’ మెసేజ్ చేసి రిక్వస్ట్ చేశారట.
పది నిమిషాల తర్వాత అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది. హాయ్ పొన్నాంబళం.. ఏంటి నీ ఆరోగ్యం బాగాలేదా.. హైదరాబాద్ కి రాగలవా వైద్యం చేయిస్తాను అని అడిగారట. నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పగా.. అయితే వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళు.. మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పారట.
నేను ఆసుపత్రికి వెళితే కనీసం నన్ను ఎంట్రీ ఫీజు కూడా అడగలేదు. మొత్తం వాళ్లే చూసుకుని వైద్యం చేశారు. వైద్యానికి రూ 45 లక్షలు ఖర్చు అయింది. అంతా చిరంజీవి అన్నయ్యే భరించారు అంటూ పొన్నాంబళం భావోద్వేగానికి గురయ్యారు. ఆ ఆసుపత్రి రామ్ చరణ్ గారి సతీమణి ఉపాసన గారిదే కావడంతో నన్ను ఇంకా బాగా చూసుకున్నారు అంటూ పొన్నాంబళం తెలిపారు.
పొన్నాంబళం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో ప్రతినాయక పాత్రలతో ప్రసిద్ధి చెందిన నటుడు. రజనీకాంత్, చిరంజీవి, విజయ్ కాంత్ కమల్ హాసన్, అర్జున్ సర్జా, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులతో నటించి తమిళ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
తెలుగులో కూడా బాగా పాపులర్ అయిన పొన్నాంబళంకు చిరంజీవితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ముగ్గురు మొనగాళ్లు, ఘరానా మొగుడు, మెకానిక్ అల్లుడు, హిట్లర్ వంటి చిత్రాల్లో ఆయన చిరంజీవితో కలిసి నటించారు. 90వ దశకంలో తెరపై క్రూరంగా, భయానకంగా కనిపించిన విలన్ లలో పొన్నాంబళం ఒకరు.