ఈ సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణల మధ్య పోటీ జరగ్గా అందులో మెగాస్టార్ చిరంజీవి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఆ సంగతి పక్కనపెట్టి ప్రస్తుతానికి వస్తే దర్శకుడు అనిల్ రావిపూడితో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని (NBK108) చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాని సెప్టెంబర్లో విడుదల చేయడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు మరియు షూటింగ్ వగైరా పనులు అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మొదట్లో వేసవిలో విడుదల చేయాలని అనుకున్నా ఇప్పుడు ఆ తేదీ నుంచి వాయిదా పడటంతో సెప్టెంబర్/అక్టోబర్ లో సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.
కాబట్టి ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉండడంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మళ్లీ యుద్ధం జరగడం తధ్యం లానే కనిపిస్తుంది. ఈ ఇద్దరు మాస్ హీరోలు ఎప్పుడు బాక్సాఫీస్ వద్ద తలపడినా అది అటు ఆన్ స్క్రీన్ లోనూ, ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంటర్ టైనింగ్ గానే ఉంటుంది.
బాలకృష్ణ 108వ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ సి.ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరిస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటిస్తున్న భోళా శంకర్ లో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, ఈ సినిమాతో ఎనిమిదేళ్ల తర్వాత మెహర్ రమేష్ దర్శకుడిగా రీఎంట్రీ ఇవ్వనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు.