ఆచార్య సినిమా విడుదలై 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కారణంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. అప్పుడప్పుడూ ఆయన చేసిన వ్యాఖ్యలు, స్టేట్ మెంట్స్ చూస్తుంటే పూర్తిగా దర్శకుడి తప్పిదమే సినిమా ఫలితాన్ని దెబ్బతీసిందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఈ మధ్య కాలంలో ప్రతి మీడియా ఇంటరాక్షన్ లోనూ దర్శకుడు కొరటాల శివ చేసిన తప్పులను పరోక్షంగా ఎత్తి చూపడానికి కారణాలను చిరంజీవి వెతుక్కుంటున్నట్టు కనిపిస్తుంది.
శనివారం హైదరాబాద్ లో జరిగిన వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి కొరటాల శివను టార్గెట్ చేశారు. బడ్జెట్ పరిమితుల్లో సినిమాను సకాలంలో పూర్తి చేయడంలోనే దర్శకుడి విశ్వసనీయత ఉంటుందని, అంతే కానీ పెద్ద హిట్లు ఇవ్వడం, సాలిడ్ స్క్రిప్ట్ లు రాయడం కాదని చిరు అన్నారు.
టాలీవుడ్ యంగ్, సీనియర్ డైరెక్టర్స్ అందరూ కాస్త బాధ పడ్డా ఈ విషయాన్ని ఒప్పుకోవాలని చిరు అన్నారు. ఈ సందర్భంగా చిరు ఏ దర్శకుడి పేరు చెప్పకపోయినా కొరటాల శివ గురించే మాట్లాడుతున్నారని అందరికీ అర్థమైంది.
కొరటాల శివ తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి నాలుగు సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇక ఆయన చిరంజీవి, రామ్ చరణ్ లతో సినిమా అనౌన్స్ చేసినప్పుడు అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
అయితే ఆచార్య భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటి నుంచి చిరంజీవి పరోక్షంగా కొరటాల శివను టార్గెట్ చేస్తూ సినిమా ఫెయిల్యూర్ కు ఆయనే కారణమని ఒక రకంగా ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం పై చిరంజీవి కొద్ది రోజుల క్రితం స్పందించారు.
వివిధ కార్యక్రమాల్లో తాను చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ శ్రేయస్సు కోసమేనని, సెట్స్ పైకి వెళ్లే ముందు దర్శకులు ప్రతి విషయాన్ని కాగితం పైన రాసుకోవాలి చిరంజీవి అన్నారు. 4 గంటల సినిమా షూట్ చేసి ఆ పైన గంట ట్రిం చేయడం కంటే 3 గంటల లోపు ఉండే స్క్రీన్ ప్లేను వర్కవుట్ చేస్తే చాలా ప్రొడక్షన్ ఖర్చులు ఆదా అవుతాయి అని ఆయన అన్నారు.
అయితే ఇది సాధారణ ప్రకటన అని, కొరటాల శివ పై కామెంట్ చేసే ఉద్దేశం తనకు లేదని చిరంజీవి అన్నారు. నేను కొరటాలను టార్గెట్ చేయలేదని, ఆయన పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి క్లారిటీ ఇస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కానీ ఆయన నోటి వెంట దర్శకుడు అన్న మాట వస్తె చాలు కొరటాల శివను అందరూ స్మరించుకుంటున్నారు.