టాలీవుడ్లో ప్రస్తుతం రీ-రిలీజ్‌లు సీజన్‌లో ట్రెండ్‌గా మారాయి. టైం మెషీన్ లో వెనక్కి వెళ్లిన తరహాలో.. తెలుగు సినీ అభిమానులు తమ అభిమాన హీరోల మాస్ బ్లాక్‌బస్టర్‌లను ఆస్వాదించడానికి అవి సరైన మార్గంగా అవతరించాయి. గతంలో సూపర్ హిట్ గా నిలిచిన పలు హీరోల సినిమాలను ఆయా హీరోల పుట్టినరోజు లేదా సినిమా వార్షికోత్సవం సందర్భంగా సినిమా రీ రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, తమ్ముడు, ఒక్కడు, పోకిరి వంటి సినిమాలను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
మరి మాస్ బ్లాక్‌బస్టర్‌ల గురించి మాట్లాడుతూ.. మాస్ గాడ్ గా పేరు గాంచిన బాలయ్య గురించి చెప్పకపోతే ఎలా.. నందమూరి బాలకృష్ణ ఫిల్మోగ్రఫీలో అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఒక సినిమా చెన్నకేశవరెడ్డి.
చెన్నకేశవ రెడ్డి రీ-రిలీజ్ అవుతుందనే అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి నందమూరి అభిమానుల్లో తారాస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్సాహమే ఈ సినిమా రీ-రిలీజ్‌లలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి దారి తీసింది.
చెన్నకేశవరెడ్డి సినిమా అమెరికాలో మొత్తం 31 చోట్ల విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బుకింగ్‌ల ద్వారా పాతిక వేల డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జల్సా సినిమా విషయానికి వస్తే ఈ కలెక్షన్లు 37 వేల డాలర్లతో అత్యధిక వసూళ్ల రికార్డ్ ప్రస్తుతం తన పేరిట ఉంచుకుంది, కానీ ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే చెన్న కేశవ రెడ్డి ఈ రికార్డ్‌ను చాలా సునాయాసంగా బద్దలు కొట్టేలా ఉంది.
2002లో విడుదలైన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. కాగా టబు మరియు శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించి తనదైన శైలిలో మాస్ డైలాగ్స్ వల్లించి ప్రేక్షకులని విపరీతంగా అలరించారు. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా తెరకెక్కించారు.
ముఖ్యంగా సినిమాలో.. బాలకృష్ణ సత్తిరెడ్డి అనే డైలాగ్ చెప్పగానే భూమి లోంచి సుమోలు పైకి లేచే సన్నివేశం మాస్ ప్రేక్షకులను అమితంగా అలరించింది. అలాగే తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు బ్రహ్మానందం పెళ్లికి ముహూర్తం పెట్టే కామెడీ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.