యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ అయిన “వాసవ సుహాస”, “ఓ బంగారం” ఇటీవల విడుదలై చక్కని స్పందనను తెచ్చుకున్నాయి.
ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు వచ్చిన స్పందన చూసి అటు గీతా ఆర్ట్స్ తో పాటు హీరో కిరణ్ అబ్బవరం కు అత్యవసరమైన హిట్ సినిమా వచ్చేస్తుంది అన్న భావన అందరిలో కలుగుతుండగానే హఠాత్తుగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది.
నిజానికి ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు జీఏ2 పిక్చర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా ఫిబ్రవరి 18న అంటే మహా శివరాత్రి రోజున విడుదల కానుందని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ కు ఉన్న శనివారం సెంటిమెంట్ కారణంగా సినిమా విడుదల తేదీని వాయిదా వేశారని తెలియ వచ్చింది.
వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలో కిరణ్ అబ్బవరంతో పాటు కష్మిరా పరదేశి హీరోయిన్ గా కనిపించనున్నారు. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మురళీశర్మ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. డానియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.