మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇద్దరు మాస్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణతో సినిమాలను రూపొందిస్తున్నారు. కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో చిరు వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తుండగా, బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డిలో నటించనున్నారు.
నిజానికి ఈ రెండు చిత్రాలను మొదలు పెట్టినప్పుడు బహుశా మైత్రీ వారు తాము ఈ సినిమాలని ఒకేసారి విడుదల చేస్తామని ఊహించి ఉండరు. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ షెడ్యూల్ ఇటలీలో జరిగే వరకు ఎవరూ ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ఊహించలేదు. డిసెంబర్ నెల ఆఖరున వస్తుంది అనే అనుకున్నారు.
అయితే కారణాలేమైనా వీరసింహారెడ్డి సినిమాని సంక్రాంతికి విడుదల చేయాల్సిందే అని బాలకృష్ణ నిర్ణయించుకోవడంతో నిర్మాతలు చేసేదేమీ లేక రెండు సినిమాలను కూడా ఒకేసారి విడుదల చేయటానికి సిద్ధం అయ్యారు.
కానీ సినిమాని కొనే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. మైత్రీ మూవీస్ రెండు చిత్రాలను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేయడమే కాక బయ్యర్లకు అధిక ధరలకు సినిమాని అమ్మే ప్రయత్నం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే రెండు చిత్రాల పై కూడా బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు. కానీ, వారు నిర్మాతలకు ఒక షరతు విధించారు.
అదేంటంటే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి రాని పక్షంలో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డిలను మైత్రి చెప్పిన విధంగా అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. ఒకవేళ ఆదిపురుష్ సినిమా కూడా సంక్రాంతి రేసులో కొనసాగితే మాత్రం ధరలలో కనీసం 25% – 30% తగ్గించుకోవాలి.
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నిర్మాతలు చాలా కాలం క్రితం సంక్రాంతి 2023ని విడుదల తేదీగా ప్రకటించారు. కానీ బాలకృష్ణ వీరసింహా రెడ్డి మరియు చిరంజీవి యొక్క వాల్తేరు వీరయ్య మాత్రమే పండగ సీజన్‌లో విడుదల అవుతాయని, ఆదిపురుష్ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకుంటుందని మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీదారులకు తెలియజేశారట.
ఇక పోతే బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి మొదటి విడుదలగా జనవరి 11 న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కానుందట. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రెండు సినిమాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్ పాత్రలో నటించారు.