బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతగానో ఎదురుచూస్తున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక సినిమా అయిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాగా ఈ చిత్రానికి ప్రేక్షకులలో హైప్ మరియు బజ్ చాలా భారీగా ఉన్నాయి. బ్రహ్మాస్త్ర చిత్రం నిన్న మొన్న మొదలైంది కాదు దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఈ సినిమా మీద చిత్ర బృందం పని చేశారు. ఇన్నేళ్ల తరువాత ఎట్టకేలకు దర్శకుడు అయాన్ ముఖర్జీ కష్టం ఫలించబోతోంది.
అయాన్ ఈ కథపై ఎంతో ఇష్టంతో పాటు ఆసక్తిని చూపారు. అంతే కాక చాలా సంవత్సరాలు పాటు శ్రమించి సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. అలాగే సినిమా బాగా తెరకెక్కించే క్రమంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ఉన్నందున కథలో ఏవైనా సూచనలు లేదా మార్పులు అవసరమైతే చేయమని అయాన్ ముఖర్జీ, ఎస్ ఎస్ రాజమౌళి మరియు కె విజయేంద్ర ప్రసాద్‌ల వద్దకు కూడా వెళ్ళారు. ఆ క్రమంలో విజయేంద్ర ప్రసాద్ సూచించిన కొన్ని మార్పులను కూడా సినిమాలో చేర్చారు.
రాజమౌళి మొదట్లో ఈ సినిమాలో భాగం కావడానికి ఇష్టపడలేదు. కానీ సినిమా పట్ల అయాన్ ముఖర్జీకి ఉన్న సంకల్పం మరియు దూరదృష్టి చూసిన తర్వాత, ఆయన ఈ సినిమా కథావిస్తరణలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. పైగా రాజమౌళి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను సమర్పిస్తున్నారు, అంతే కాక ఈ సినిమా కోసం ఆయన చిత్ర బృందంతో కలిసి ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొన్నారు.
అందువల్లే బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని ఇది చిత్రానికి భారీగా పనిచేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా హిందీ డబ్బింగ్ చిత్రాలకు అంతగా తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ దక్కడం జరగదు కానీ బ్రహ్మాస్త్ర సినిమా ఆ పద్ధతిని మార్చేసి ఆశ్చర్యపరిచింది.
సినిమాలో కంటెంట్ బాగుంటుంది అన్న నమ్మకం ప్రేక్షకుల్లో కలిగిన కారణంగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్‌ను ఆదరిస్తారనేది తెలిసిన విషయమే. ఇప్పుడు బ్రహ్మస్త్ర సినిమాతో మరోసారి రుజువు చేస్తున్నారు.
బ్రహ్మాస్త్ర చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.