రణబీర్ కపూర్ నటించగా భారీ హైప్ తో వచ్చిన ఫాంటసీ చిత్రం బ్రహ్మాస్త్ర గత నెల అంటే సెప్టెంబర్ 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఒకరకంగా బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో పబ్లిసిటీ జరుపుకున్న ఈ చిత్రం విడుదలయ్యే నాటికి బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాగోలేదు. కరోనా మహమ్మారి దెబ్బకు పతనంలో ఉన్న పరిశ్రమను బ్రహ్మాస్త్ర కొంత వరకు బయటకు తీసుకురాగలిగింది.
ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ తో విడుదలైంది. ఆ హైప్ కు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. అలానే ఆ తర్వాత నిలకడగా రన్ కూడా వచ్చింది. అయితే ట్రేడ్ సర్కిల్‌లు విడుదలకు ముందు ఊహించిన విధంగా ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్ కానప్పటికీ, ఖచ్చితంగా వారాంతాల్లో బాగానే ఆకట్టుకునే నంబర్‌లను నమోదు చేసి డీసెంట్ హిట్ గా నిలిచింది. కాగా బ్రహ్మస్త్ర సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కు చక్కని ప్రశంసలు కూడా దక్కాయి.
ఇక కథలో అత్యంత ఆసక్తికరమైన అంశాలు ఉన్నా.. యాక్షన్ ఎపిసోడ్స్ మినహా ఆ స్థాయిలో సినిమాని పకడ్బందీగా తెరకెక్కించలేదని, ఫాంటసీ అంశాల కంటే ప్రేమకథకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమంత సరికాదని కొందరు ప్రేక్షకులు విమర్శలు కూడా చేశారు. ఏదేమైనా ముందుగానే చెప్పుకున్నట్లు థియేటర్ల వైపు చూడటం దాదాపు మానేసిన బాలీవుడ్ ప్రేక్షకులను రప్పించే ప్రయత్నంలో చాలా వరకు బ్రహ్మస్త్ర విజయం సాధించిందనే చెప్పాలి.
కాగా ఇప్పుడు బ్రహ్మాస్త్ర డిజిటల్ ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. అడ్వెంచర్ ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 4న డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లోనూ ప్రసారం కానుంది.
బ్రహ్మాస్త్ర పోస్ట్ పాండేమిక్ విడుదలయిన బాలీవుడ్ చిత్రాలలో అత్యధిక గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. మరియు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగలిగింది.
బ్రహ్మాస్త్ర చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున మరియు మౌని రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.
ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఈ సెప్టెంబర్ లో విడుదల కాగా తదుపరి చిత్రం ‘బ్రహ్మాస్త్ర- పార్ట్ 2 దేవ్’ 2025లో విడుదల కానుందని తెలుస్తోంది.