ఇటీవలి కాలంలో బాలీవుడ్ పరిస్థితి సరైన స్థితిలో లేదన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు భారతీయ సినిమా పై ఏకచత్రాధిపత్యం చలాయించిన హిందీ చిత్ర పరిశ్రమ.. ప్రస్తుతం కష్టాల్లో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు కూడా ప్రేక్షకులని థియేటర్ల వద్దకు రప్పించలేకపోతున్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం “బ్రహ్మాస్త్ర” సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా బాలీవుడ్ కు పూర్వవైభవం తీసుకు వస్తుందని వారి అంచనా.
కరోనా పాండమిక్ తర్వాత ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పులు వచ్చాయి. భారీ బడ్జెట్ ఫాంటసీ సినిమాలు లేదా ఏదో ఒక ఆసక్తికరమైన సినిమాల్నే ఆదరిస్తున్నారు. ఒకవేళ రొటీన్ సినిమాలు హిట్ అయినా.. అవి ఎంతో అద్భుతమైన టాక్ ను పొందినప్పుడు మాత్రమే సాధ్యం అవుతున్నాయి. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఇలాంటి ఇబ్బందిని మొదట్లో ఎదురుకున్నా, ప్రేక్షకుల నాడిని కాస్త ఆలస్యంగా అయినా పట్టుకుని విజయాల బాట పట్టింది.
కానీ హిందీ సినిమాలతో అక్కడి ప్రేక్షకులు బాగా దూరం అయినట్టుగా ప్రస్తుత పరిస్థితి నెలకొంది. పెద్ద హీరోలు లేదా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు కూడా కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. కాగా 2021లో వచ్చిన ‘సూర్యవంశీ’ సినిమా తొలి రోజు దాదాపు 27 కోట్ల నెట్ వసూలు చేయగా,, ఇప్పటికీ ఇదే బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా కొనసాగుతుంది.
అదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ మరియు కేజీఎఫ్ 2 సినిమాలు ఈ ఏడాది హిందీ వెర్షన్లు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను సాధించాయి. ఇప్పుడు “బ్రహ్మాస్త్ర” సినిమా కూడా తొలి రోజు బాక్స్ ఆఫీసు వద్ద భారీ నంబర్లు నమోదు చేసే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.
బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర: మొదటి భాగం-శివ’ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం ముంబైలోనే కాకుండా దక్షిణాదిన హైదరాబాద్ – బెంగళూరు – చెన్నైలలో కూడా చాలా బాగున్నాయి. ఈ వరస చూస్తుంటే బ్రహ్మాస్త్ర సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించేలానే కనిపిస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ ద్వారా 10 కోట్ల ఫిగర్ ను దాటిన బ్రహ్మాస్త్ర తొలిరోజు దేశ వ్యాప్తంగా దాదాపు రూ. 30 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే గనక జరిగితే బాలీవుడ్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పాలి.
‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్ , అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టార్ స్టూడియోస్ – ధర్మ ప్రొడక్షన్స్ – ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కాగా దక్షిణాది భాషల్లో ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.