నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఫాంటసీ కమ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఈ వారం విడుదల అయి అధ్భుతమైన స్పందనను రబట్టుకుంది.
బాక్సాఫీస్ వద్ద తనదైన ఆధిపత్యాన్ని చూపిస్తూ.. తిరుగులేని రారాజు తరహాలో నిలిచింది. గత కొంత కాలంగా సరైన విజయం లేకుండా తెలుగు సినీ పరిశ్రమ చాలా కష్ట కాలంలో ఉన్న పరిస్థితుల్లో.. బింబిసార అసలు సిసలైన బ్లాక్ బస్టర్ ను అందించింది. అటు క్లాస్ ప్రేక్షకులు ఇటు మాస్ ప్రేక్షకులు, మరియు ఫ్యామిలీ ప్రేక్షకులు అందరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఆన్లైన్ టికెటింగ్, భారీ రిలీజ్ ల వల్ల థియేటర్ల వద్ద హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టడం పెద్ద సినిమాలకే తొలి రోజు తప్ప పెద్దగా సాధ్య పడట్లేదు. అలాంటిది బింబిసార చిత్రం రెండో రోజు, మూడో రోజు కూడా థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు ఉంచే స్థాయిలో ఆడుతుంది. ఇది కేవలం ఎగ్జిబిటర్లకే కాదు సినీ ప్రేమికులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం.
అందరికీ లాభాలు అందించే దిశగా పయనిస్తున్న ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కును దాటి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఈ సినిమా వల్ల సంతోషంగా ఉన్నారు. అంతే కాదు… నిర్మాత హరికృష్ణ .కె, హీరోను కలిసి ఒక విందు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారట.తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ అంటే సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ‘బింబిసార’ 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ కూడా అంతే. అంటే ఇప్పటికే పెట్టుబడిని తెచ్చేసినట్లు.. ఇకపై వచ్చేవి అన్నీ లాభాలే.
100 శాతం రికవరీ చేసిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా చూస్తే… ఇంతకు ముందు ఆయనకు అత్యుత్తమ విజయం అందించిన పటాస్ సినిమాని దాటేసి ఆయన కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. కల్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద ఇంత భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా పంపిణీదారులు మరియు సినీ ప్రేమికులు, పరిశ్రమ వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.