భారతీయ సినీ రంగంలో అతి పెద్దదైన పరిశ్రమగా హిందీ చలనచిత్ర పరిశ్రమ గురించి చెప్పుకుంటారు.. ప్రేక్షకులు అందరూ ముద్దుగా బాలీవుడ్ అని పిలుచుకుంటారు. అయితే బాలీవుడ్ పరిస్థితి గత కొంత కాలంగా ఏమీ బాగోలేదు. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరైన విధంగా ప్రభావం చూపలేకపోతున్నాయి. లాల్ సింగ్ చడ్డా వంటి పెద్ద సినిమాలు కూడా ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించలేకపోయాయి. బహిష్కరణ ప్రచారం ట్రెండ్‌గా మారకముందే, బాలీవుడ్ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి.
అయితే బాలీవుడ్ సినిమాలు పనిచేయకపోవడానికి ప్రధాన కారణం స్క్రిప్ట్‌లో సరైన కంటెంట్ లేదా సహజమైన వాతావరణం లేకపోవడమే. అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్, లక్ష్మి, బచ్చన్ పాండే వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కాగా బెల్ బాటమ్ సినిమా థియేటర్ల పరిస్థితి ఇంకా మెరుగవని రోజుల్లో వచ్చింది. కానీ బచ్చన్ పాండే మాత్రం అన్ని సినిమాలు మామూలుగా ఆడుతున్న రోజుల్లోనే వచ్చి పరాజయం పాలయింది.
ఆ తరువాత బాలీవుడ్ కు కొత్త సమస్య పుట్టుకొచ్చింది. పిచ్చి పిచ్చి కారణాలతో సోషల్ మీడియా యూజర్లు, నెటిజన్లు బాలీవుడ్ చిత్రాలను బహిష్కరించడం ప్రారంభించారు. అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దాను లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ సినిమాని కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ప్రదానంగా సినిమాలో సరైన విషయం లేకపోవడం వల్ల విఫలమయ్యాయి. అయితే ఎలాగూ వీటికి కలెక్షన్లు రాకపోవడంతో బాయ్కాట్ బ్యాచ్ మా వల్లే ఈ సినిమాలు ఆడలేదని తప్పుడు ప్రచారం జరుపుకున్నారు.
అంతటితో ఆగకుండా ఇప్పుడు విడుదలయ్యే దాదాపు ప్రతి సినిమాని కూడా ఏదో ఒక కారణంతో బహిష్కరించాలని పిలుపునివ్వడం మొదలు పెట్టారు. ఈ ధోరణి మరీ అతివాద తరహాలో ఉంది. భారతదేశ సంస్కృతిని ప్రేమిస్తున్నాము అని చెబుతూ అనవసరమైన రాద్ధాంతం చేస్తూ నెగటివిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ వారం విడుదలవుతున్న బ్రహ్మాస్త్ర సినిమాని బహిష్కరించాలని నెటిజన్లు నిర్ణయించుకున్నారు. ఈ ట్రెండ్ మొదలయినప్పటి నుండీ కరణ్ జోహార్ ను లక్ష్యంగా చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు తమ తడాఖా చూపించాలని వారు అనుకుంటున్నారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా సినీ ప్రేమికులు బ్రహ్మాస్త్ర సినిమాకి అద్భుతమైన బుకింగ్స్ తో సహకరిస్తున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీని తిరిగి విజయపథంలోకి దూసుకువెళ్లేలా చేసే సినిమా బ్రహ్మాస్త్ర మాత్రమేనని ఇండస్ట్రీ మరియు ట్రేడ్ వర్గాలు భారీ ఆశలతో ఉన్నాయి. కానీ కొన్ని వర్గాలు మాత్రం ఈ బాయ్కాట్ ట్రెండ్ వల్ల సినిమా కలెక్షన్లు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి.
అయితే సినిమా కంటెంట్ బాగున్నంత కాలం, ప్రేక్షకులు ఆ సినిమాలని ఖచ్ఛితగా ఆదరిస్తారు. అలాంటి సినిమాలను ఏ బాయ్కాట్ ట్రెండ్ కూడా ఏమీ చేయలేదనేది నిజం.