వరుస ఫ్లాపులతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు కొంత కాలం తరువాత మంచి రోజులు రానే వచ్చాయి. మునుపటిలా ప్రేక్షకులు మళ్ళీ సినిమాలు చూడరా.. విజయాలు అనేవి ఇంక తెలుగు సినిమాకు అందని ద్రాక్షగా మిగిలిపోతుందా ? వంటి ప్రశ్నలకు ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చాయి.
గత కొంత కాలంగా చాలా ధీనావస్థలో కొట్టు మిట్టాడుతున్న పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో డీజే టిల్లు వంటి బ్లాక్ బస్టర్ తరువాత.. మార్చిలో ‘RRR’ వంటి ప్యాన్ ఇండియా సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా వద్ద రికార్డుల మోత మోగించింది. దాంతో పాటు అపారమైన గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.
అయితే ఆ తరువాత నుంచి భారీ పరాజయాలతో ఒక్కో సినిమా ఫ్లాప్ అవుతూ ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెట్టేశాయి.
ఇక ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలైన సినిమాలు బింబిసార, సీతారామం. అందరి చూపు ఈ రెండు సినిమాల పైనే.. కనీసం ఈ సినిమాలైనా విజయాలు సాధించి పరిశ్రమకు ఊపిరి పోస్తే బాగుంటుందనే అభిప్రాయం అందరిలోనూ ఉండగా రెండు చిత్రాలు ఆ నమ్మకాన్ని నిలబెట్టాయి.
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన చారిత్రాత్మక నేపథ్యం గల ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ నటించిన మ్యాజికల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కల్యాణ్ రామ్ నపటించిన ‘బింబిసార’ 5వ దశాబ్దానికి చెందిన బింబిసారుడిని ప్రధాన పాత్రలో తెరకెక్కింది. మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సరికొత్త నేపథ్యంతో పాటు మాస్ ని అలరించే పోరాట సన్నివేశాలు కూడా వుండటంతో ఈ సినిమాకి ప్రేక్షకులు విజయాన్ని అందించారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కల్యాణ్ రామ్ కు భారీ విజయాన్ని దక్కింది. ఎన్నో ఏళ్ల తరువాత థియేటర్ల వద్ద హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించడం విశేషం. తొలిరోజు కలెక్షన్ల తోనే ఈ సినిమా దాదాపు యాభై శాతం రికవరీ సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఇక దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ రెండు కాలమానాల నేపథ్యంలో సాగే కల్పిత ప్రేమగాథగా తెరకెక్కింది. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాని నడిపించిన తీరు చక్కని అనుభూతిని కలిగించడంతో పాటు ఆహ్లాదకరమైన విజువల్స్, వీనులవిందైన సంగీతం.. అలాగే వైజయంతి బ్యానర్ నిర్మాణ విలువలు కలగలిపి ఓ అందమైన సినిమాగా నిలబెట్టాయి. మొదట్లో మరీ స్లోగా నడిచిన భావన కలిగినా.. సీతారాముల ప్రేమకథను ప్రవేశ పెట్టిన విధానం సినిమాని నిలబెట్టింది. ఈ సినిమా కూడా తొలిరోజు కలెక్షన్లతో పాతిక వంతు రికవరీ సాధించింది.
మొత్తానికి అటు బింబిసార’ ఇటు ‘సీతారామం’.. రెండు సినిమాలు కూడా టాలీవుడ్ వాటి పై పేరుకున్న అంచనాలను అందుకుని విజయం సాధించి కొండంత అండగా నిలిచాయి.