‘ఆర్ఆర్ఆర్’ టీం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఎందుకంటే ఆస్కార్ అవార్డులకు నామినేషన్లు ఈరోజే ప్రకటించనున్నారు. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న ఎంఎం కీరవాణి ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కు నామినేట్ అయ్యే వారిలో ముందు వరుసలో ఉన్నారు.
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) చిత్రం మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జరుగుతున్న అవార్డుల సీజన్లో ఆర్ఆర్ఆర్ మంచి ప్రదర్శన కనబరిచి ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో కూడా భారీ విజయాన్ని అందుకుంది. దీనికి తోడు ఉత్తమ నటుడి కేటగిరీలో ఎన్టీఆర్ నామినేట్ కావడం పై గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
యూఎస్ఏ టుడే సంస్థ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ ను ఎంపిక చేసింది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనబర్చిన నటనకి 95వ ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ లో ఓటు వేసే సందర్భంలో అకాడమీ తనని గుర్తించకుండా ఉండదని ఆ వెబ్సైట్ అంచనా వేసింది.
2023 ఆస్కార్ అవార్డ్స్ కోసం తమ అంచనాలలో జూనియర్ ఎన్టీఆర్ పేరును ‘వెరైటీ’ కూడా ప్రస్తావించింది. ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆస్కార్ మిషన్ కు నాటు నాటు పాట బలమైన ఆశగా మిగిలిపోగా, ఇక ఇతర కేటగిరీల్లో సర్ప్రైజ్ నామినేషన్లు ఏమైనా వస్తాయో లేదో చూడాలి. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఆస్కార్ నామినేషన్లు వెలువడనున్నాయి. మరి చిత్ర యూనిట్ అన్ని విధాలుగా కష్టపడి ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు తన లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి.