తారకరత్న పెద్ద కర్మలో ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ లతో నందమూరి బాలకృష్ణ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ప్రవర్తన ఎంత మాత్రం సరికాదని కేవలం ఎన్టీఆర్ అభిమానులే కాదు, ఇతర హీరో అభిమానులు కూడా ఖండిస్తున్నారు, ఎన్టీఆర్ పట్ల సానుభూతి చూపిస్తున్నారు.
తారకరత్న పెద్ద కర్మలో బాలకృష్ణకు గౌరవ సూచకంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లేచి నిలబడినప్పటికీ ఆయన వారిద్దరినీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వీడియో గత రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నందమూరి ఫ్యామిలీ అభిమానులు షాక్ అవుతున్నారు.
ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య అంతగా సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లకు మునుపు బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ చాలా మాట్లాడేవారు కానీ 2009 ఎన్నికల తర్వాత అదంతా మెల్లగా కనుమరుగైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ కొన్ని కుటుంబ వేడుకలు మినహా టీడీపీకి, చంద్రబాబుకు, బాలకృష్ణకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఇప్పుడు తాజాగా వైరల్ అయిన వీడియో తర్వాత ఈ అంశం మళ్లీ తెర పైకి వచ్చింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో బాలయ్య సరిగా మాట్లాడకపోవడం ఉద్దేశ్యపూర్వకంగానే చేసిందని కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్ అవుతున్నప్పటికీ అదే రోజున బాలయ్య ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో మాట్లాడి ఉంటారో లేదో ఎవరికీ తెలియదు. అయితే ఎన్టీఆర్ తో బాలయ్య వ్యవహరించిన తీరు పై ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై చర్చ వచ్చినప్పుడల్లా బాలయ్య పరోక్షంగా ఎన్టీఆర్ ను విస్మరించి చిన్నచూపు చూస్తూ వచ్చారు. అది పక్కన పెడితే ఇలా బహిరంగంగా ఎన్టీఆర్ పట్ల బాలయ్య ప్రవర్తించిన తీరు ఆయన అభిమానులను బాధపెడుతోంది. మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.