మహేష్ బాబు త్రివిక్రమ్ ల SSMB28 సినిమా ఆగస్ట్ 11న విడుదల కానునట్లు ఇదివరకూ వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదల కూడా అదే తేదీన అని ప్రకటించడంతో మహేష్ సినిమా పై ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఆగస్ట్ 11న తమ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు భోళా శంకర్ బృందం తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. కాబట్టి, SSMB28 అనుకున్న విడుదల తేదీ నుండి వాయిదా వేయబడవచ్చు అని మహేష్ అభిమానులు మరియు నెటిజన్లు కూడా అంటున్నారు.
ఎందుకంటే భోళా శంకర్ సినిమా నిర్మాత అనిల్ సుంకర మరియు దర్శకుడు మెహర్ రమేష్ ఇద్దరూ మహేష్ బాబుకు సన్నిహితులే, కాబట్టి వారు మహేష్ బాబుకి తెలియజేయకుండా ఈ విడుదల తేదీని ప్రకటించలేరని కూడా కొందరు అంటున్నారు. కాగా SSMB28 సినిమా దసరా లేదా సంక్రాంతికి విడుదల కావచ్చని ఇప్పటికే పుకార్లు వచ్చాయి. అయితే, ఏ విషయమైనా SSMB28 బృందం నుండి అధికారిక నిర్ధారణ కోసం వేచి ఉండాలి.
ఇక భోళా శంకర్ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, కీర్తి సురేష్ ఆయన సోదరి పాత్రలో నటిస్తుండగా, తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తుండగా, మెహర్ రమేష్ దర్శకుడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై భోళా శంకర్ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.