తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాత మరియు నటుడు కూడా అయిన బండ్ల గణేష్ ఆయన వ్యక్తిగత పనుల కన్నా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ఒక రకంగా బండ్ల గణేష్ తనకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పచ్చు. బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమను చాలాసార్లు వ్యక్తం చేశారు. అలాగే ఆయన పవన్ కళ్యాణ్‌ను ఎంతగా ఆరాధిస్తున్నాడనే విషయం చాలా స్పష్టంగా అందరికీ తెలుసు.
అయితే తన అభిమానాన్ని మరోసారి వినూత్నంగా చాటుకున్నారు బండ్ల గణేష్. అదెలా అంటే.. బండ్ల గణేష్ తదుపరి చిత్రం సెప్టెంబర్ 2న అంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓటిటిలో విడుదల కానుంది. తమిళంలో అద్భుతమైన ప్రశంసలతో పాటు అవార్డులను కూడా అందుకున్న ఒత్త సెరుప్పు సైజ్ 7కి రీమేక్ గా తెరకెక్కిన తాజా బండ్ల గణేష్ చిత్రం డేగల బాబ్జీ, రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆహా తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించబడుతుంది.
ఒత్త సెరుప్పు లాగా డేగల బాబ్జీలో కూడా ఒకే ఒక్క నటుడు ఉంటాడు. ఈ సినిమాలో బండ్ల గణేష్, నటుడిగా తన సత్తా చాటాడని ట్రైలర్ చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోంది. వరుస నేరాలు చేసినందుకు పోలీసులచే శిక్షించబడిన ఒక వ్యక్తి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఎందుకు నేరాలు చేశావని పోలీసులు ప్రశ్నించబడినప్పుడు, ప్రధాన పాత్ర అందుకు ఆసక్తికరంగా వివరించే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
ఒత్త సెరుప్పు సైజ్ 7 సినిమా జాతీయ అవార్డులతో సహా అనేక ప్రశంసలను గెలుచుకున్న చిత్రం. తమిళ నటుడు ఆర్ పార్థిబన్ ఈ చిత్రానికి ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా రచన మరియు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఈ రీమేక్ సినిమా పట్ల బండ్ల గణేష్ కు భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ఇది ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.
ఈ సినిమాలో పాత్రధారులలో కేవలం బండ్ల గణేష్ మాత్రమే మనకు కనిపిస్తాడు, ఇతర నటీనటులు కనపడకుండా కేవలం వారి గొంతులు మాత్రమే వినపడతాయి. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకుడు కాగా స్వాతి ఎస్ నిర్మాత. లైనస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహారించారు. మరి ఈ చిత్రంతో బండ్ల గణేష్ నటుడిగా చక్కని ప్రశంసలు అందుకుంటారని ఆశిద్దాం.