తెలుగు సినీ హాస్య నటుడు మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్ తన వృత్తి పరంగా అనుకున్నంత స్థాయిలో ఎదగలేదు ఏమో కానీ వ్యక్తిగతంగా మాత్రం చాలా పాపులర్ అయ్యారు. సినిమా ఆడియో ఫంక్షన్ కావచ్చు, లేదా యూట్యూబ్ లో ఇచ్చే ఇంటర్వ్యూ కావచ్చు.. రాజకీయాలలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు. బండ్ల గణేష్ ఏం మాట్లాడినా అది సంచలనం అవుతుంది.
ఆ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్, ఎలక్షన్ల ప్రచార నిమిత్తం మీడియా కు కొన్ని ఇంటర్వ్యూలు మరియు న్యూస్ ఛానళ్లలో చర్చలలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఇచ్చిన స్టేట్మెంట్ లు సీరియస్ గా కాక ప్రజలందరినీ కడుపుబ్బా నవ్వించాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే సెవెనో క్లాక్ బ్లేడ్ తో పీక కోసుకుంటా అంటూ బండ్ల గణేష్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత అదే విషయమై సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పై సెవెనో క్లాక్ బ్లేడ్ పేరు మీద ట్రోల్స్ విపరీతంగా పుట్టుకొచ్చాయి.
తాజాగా మరోసారి బండ్ల గణేష్ ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం చర్చనీయాంశం అవుతుంది. నోటికి ఎది వస్తే అది మాట్లాడి ఇబ్బందుల్లో చిక్కుకునే అలవాటు ఉన్న బండ్ల గణేష్.. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవలే చోర్ బజార్ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు.
‘భీమ్లానాయక్’ సినిమా సమయంలో త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిడుతున్న ఆడియో ఒకటి బయటికి రావడం, అంతే కాక ఆ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీని పై తాజాగా వివరణ ఇచ్చారు బండ్ల గణేష్. తాను త్రివిక్రమ్ ను తిట్టిన మాట వాస్తమేనని అయితే అలా మాట్లాడినందుకు తాను త్రివిక్రమ్ కు క్షమాపణలు కూడా చెప్పానని అన్నారు.
ఇలాంటి విషయాల్లో ఇంత తేలిగ్గా, అపరిపక్వతతో బండ్ల గణేష్ మాట్లాడడం చూసిన నెటిజన్లు మరియు ఇండస్ట్రీ వర్గాలు.. బండ్ల గణేష్ ఇలాంటి ప్రవర్తన వల్ల తన గౌరవం కొలోతున్నారని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం బండ్ల గణేష్ ఇలానే ఉండాలని అప్పుడే తమకు ఎంటర్టైన్మెంట్ అందిస్తారని అంటున్నారు. మరి బండ్ల గణేష్ తన వైఖరిని మార్చుకుంటారా లేదా అనేది చూడాలి.