ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా కూడా అది వివాదం అయ్యిపోతుంది. ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రచారం సందర్భంగా దేవబ్రాహ్మణల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడారని, ఆ తరువాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని నాగేశ్వరరావుని అవమానపరిచేలా వ్యాఖ్యానించారు అంటూ బాలకృష్ణను వివాదాలు చుట్టుమట్టాయి.
ఇక తాజాగా నర్సుల పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య, తనకి గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ‘ఆ నర్సు, దానమ్మ భలే అందంగా ఉందిలే’ అంటూ మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదానికి దారి తీశాయి. బాలకృష్ణ వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోని, నర్సులకు బహిరంగా క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. ఈ విషయం పై నేడు బాలకృష్ణ స్పందిస్తూ నర్సులకు బహిరంగ లేఖతో క్షమాపణలు తెలియజేశారు.
“నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను” అంటూ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు తెలిపారు.
అంతకు ముందు దేవబ్రాహ్మణల వివాదంలో కూడా బహిరంగ క్షమాపణ చెప్పిన బాలయ్య.. అక్కినేని వివాదంలో మాత్రం క్షమాపణ చెప్పకపోగా.. ఆయన కుటుంబ సభ్యుల కంటే తనకే అక్కినేని నాగేశ్వరరావు గారి పై ఆప్యాయత ఉందని చెప్పడం గమనార్హం.
ఏదేమైనా బాలకృష్ణ ఈ మధ్య తరచూ ఎవరో ఒకరికి అభ్యంతరకరంగా అనిపించే వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడం నిత్యకృత్యంగా మార్చుకున్నారు.