గత కొన్ని రోజులుగా తన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో ఉంటున్న హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య బాలకృష్ణ మాట్లాడుతున్న మాటలు వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా నర్సుల సంఘం బాలకృష్ణ మాటతీరుని తప్పు పట్టింది.
అసలు జరిగింది ఏమిటంటే .. ఇటీవల బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నర్సులపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్చంద ప్రసాద్ తెలిపారు. ఇదే సందర్భంలో బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ కూడా చేశారు.
అన్‌స్టాపబుల్ సీజన్‌లో ప్రసారమైన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌లో తనకు యాక్సిడెంట్ జరిగిన విషయం గురించి బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్‌కి వివరిస్తున్న సందర్భంలో నర్సు ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని నర్సుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేశారు.
తనకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన నర్సు పై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంత వరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ గనక బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.
ఈ మధ్య కాలంలో బాలకృష్ణ మాట్లాడుతున్న మాటలు వివాదాలకు దారి తీస్తున్నాయి. కొన్ని రోజుల ముందు దేవ బ్రాహ్మణుల విషయంలోనూ ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఆయన మాట్లాడిన మాటల విషయంలోనూ బాలకృష్ణ పై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నర్సుల పై బాలయ్య వ్యాఖ్యలతో మరో దుమారం చెలరేగింది.