అక్కినేని నాగచైతన్య తాజాగా విడుదలైన లాల్ సింగ్ చడ్డా సినిమాతో తొలిసారి బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అది పూర్తి స్థాయి హీరో పాత్ర కాదు, కేవలం 20 నిమిషాల పాటు సాగే ఒక ముఖ్య అతిథి పాత్రలో నాగచైతన్య నటించారు. అయితేనేం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరున్న అమీర్ ఖాన్ సినిమాలో.. అందులోనూ ఆరు ఆస్కార్ అవార్డులు సాధించిన ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ అయిన సినిమాలో పాత్ర అంటే ఖచ్చితంగా ఏదో మంచి విషయమే ఉంటుందని అందరూ భావించారు.అయితే ఈ గురువారం విడుదలైన లాల్ సింగ్ చడ్డా సినిమా అనూహ్యంగా అత్యంత పేలవమైన రివ్యూలు మరియు అంతే దారుణమైన కలెక్షన్లు రాబడుతూ బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి దిశలో పయనిస్తుంది.
అదేదో సామెత చెప్పినట్లు ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్న చందాన, బాలివుడ్ ప్రేక్షకుల దృష్టిలో పడటానికి ప్రయత్నం చేస్తే అటు సినిమా ఫలితం నిరాశాజనకంగా ఉండటం.. ఇటు సొంత రాష్ట్రంలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఇలాంటి పాత్ర చేయడం ఏంటని విమర్శించడంతో ప్రస్తుతం కాస్త గందరగోళంగా ఉంది చైతన్య పరిస్థితి.
ముందుగానే చెప్పుకున్నట్లు లాల్ సింగ్ చడ్డా సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య చేసిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకి వస్తున్న దారుణమైన రివ్యూల సంగతి పక్కన పెడితే నాగచైతన్య పాత్ర తీరుతెన్నులు తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేని విధంగా ఉన్నాయి.ఈ సినిమాలో నాగచైతన్య ఆర్మీలో పనిచేసే బాలరాజు అనే తూర్పుగోదావరి జిల్లా బోడిపాలెం అనే గ్రామానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఐతే విచిత్రంగా సినిమాలో దాదాపు నాగచైతన్య నోరు తెరిచిన ప్రతిసారీ చెడ్డి బనియన్ అనే మాట వస్తుంది. బాలరాజు తాతల కాలం నుంచి బనియన్లు, చెడ్డీలు తయారు చేసే పనిలో ఉంటారు. అందుకే బాలరాజు పలికిన డైలాగులన్నీ ఈ చెడ్డి, బనియన్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో అలాంటి డైలాగుల వల్ల హాస్యరసం పండించాలనే ఉద్దేశ్యంతో అలా పాత్ర చిత్రణను రాసుకున్నారు కావచ్చు.అయితే అటు డైలాగులతో పాటు నాగచైతన్య ఆహార్యం కూడా ఏమాత్రం రుచించని సిద్ధంగా ఉందని ఒక వాదన వినిపిస్తోంది.
సినిమాలో ఒక సందర్భంలో బాలరాజు తండ్రి మరియు తాత ముత్తాత పాత్రలలో కూడా నాగచైతన్య కనిపిస్తారు. వాటిని కామెడీ కోసమే సినిమాలో పెట్టినట్లు అనిపిస్తుంది. ఐతే ఆ సన్నివేశాలను ఇతర అభిమానులు తమ హీరోని ట్రాల్ చేయడానికి ఉపయోగించుకుంటారు ఏమో అని అక్కినేని అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఈ పాత్ర కోసం ముందుగా తమిళ నటుడు విజయ్ సేతుపతి, నాచురల్ స్టార్ నానిని సంప్రదించారట. ఆ ఇద్దరూ చేయలేక పోవడంతో ఆ పాత్ర చివరికి నాగచైతన్య వద్దకు వచ్చింది.
ఐతే బాలీవుడ్ ప్రేక్షకులకి చేరువ అవ్వాలనే ఉద్దేశంతో నాగచైతన్య ఈ సినిమా చేస్తే ఆ ఆశలు ఏమాత్రం నిజం కాలేదు.ఎత్తు పళ్ళు పెట్టుకుని, చెడ్డీ బనియన్ అంటూ డైలాగులు చెప్పే పాత్రతో బాలీవుడ్ అరంగ్రేటం చేయటం ఏంటని కొందరు బాలీవుడ్ ప్రేక్షకులు మరియు విమర్శకులు అభిప్రాయ పడ్డారు. అంతటితో ఆగకుండా కమల్ ఖాన్ వంటి సోషల్ మీడియా రివ్యూయర్లు నాగచైతన్యను ట్రాల్ చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం.
మొత్తానికి అతిథి పాత్రలో నాగచైతన్య నటనను కొంత మంది ప్రేక్షకులు ఒక వర్గం ప్రేక్షకులు మెచ్చుకున్నా.. కొంత మంది ట్రాల్ చేయడం పట్ల..అసలు ఇలాంటి పాత్రతో హిందీలో చేయడం పట్ల ఆయన అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు. ఇలాంటి సినిమా చేయకుండా ఉంటేనే బాగుండేదని వారు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి భవిష్యత్తులో అయినా ఇలాంటి పాత్రల విషయంలో నాగచైతన్య కాస్త ఆలోచించుకుని, అభిమానుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటే ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.