బాహుబలి 1, 2 సినిమాల భారీ విజయాల వెనుక బలమైన శక్తుల్లో నిర్మాత శోభు యార్లగడ్డ ఒకరు. ఆయన మార్కెటింగ్ మేధావితనంతో పాటు ఒక ప్రత్యేకమైన అవుట్ రీచ్ వ్యూహం బాహుబలిని హద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ దృగ్విషయంగా మార్చడానికి సహాయపడింది. శోభు లేకపోతే ఆ ఎపిక్ యాక్షన్ సినిమా ఇంతటి కల్ట్ స్టేటస్ సాధించడం అసాధ్యమని రాజమౌళి కూడా గతంలో చెప్పుకొచ్చారు.
ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’కు కూడా శోభు తన వంతు సహకారం అందించారని సమాచారం. నిర్మాతగా ఆయనకు ఆర్ఆర్ఆర్ సినిమాతో సంబంధం లేకపోయినా ఆస్కార్ ప్రచారానికి ఆర్థికంగా సహకరిస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా ఒక సినిమాకు జరిగే ఆస్కార్ ప్రచారానికి భారీ మార్కెటింగ్, టూరింగ్ మరియు అవుట్ రీచ్ యాక్టివిటీస్ ఇలా ఎన్నో అవసరం అవుతాయి. కాగా రాజమౌళితో కలిసి ఈ వ్యవహారాలు అన్నీ నిర్వహించడానికి శోభు సరైన వ్యక్తి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆస్కార్ ప్రచారానికి విడుదలైన తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇందులో నిర్మాత డీవీవీ దానయ్య ప్రమేయం ఏమాత్రం లేదట. ఈ ప్రచారానికి పూర్తిగా బాహుబలి నిర్మాత శోభు ఆర్థిక సహాయం అందించారని, ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి ప్రతి ప్రచారానికి కూడా హాజరయ్యాడని ఇండస్ట్రీ టాక్.
ఏదేమైనా అందరి శ్రమ ఫలించి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కితే అందరికీ ఆనందం. కాగా ఆస్కార్ అవార్డు యొక్క ప్రచారానికి ఎంత శ్రమ అవసరం అవుతుందో నిర్మాత శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు.