ఈ సంక్రాంతి సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఇద్దరు సీనియర్ స్టార్ల సినిమాలు ఘనవిజయం సాధించి థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి వెంటనే భోళా శంకర్ షూటింగ్ కు మకాం మార్చారు.
అదే విధంగా అఖండ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బాలయ్య, వీరసింహారెడ్డి రూపంలో మరో సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాన్ని అందించారు. కాగా తదుపరి చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ (NBK108) సినిమా చేయబోతున్నారు. ఇక బాలయ్య కూడా అన్ స్టాపబుల్ 2 తో బిజీగా ఉంటూ తన అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.
ఇలా సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ప్రస్తుత తరం హీరోలు సినిమాల మధ్య, షూటింగ్ షెడ్యూల్స్ లో కూడా భారీ గ్యాప్ తీసుకుంటున్నారు.
ప్రస్తుత తారలు చాలా మంది తమ ‘పాన్ ఇండియా’ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 2-3 సంవత్సరాలు గడుపుతున్నారు. అయితే తమ అభిమాన తారలను తెర పై చూడటానికి అభిమానులు సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఈ వైఖరి గమనించిన ప్రేక్షకులు.. యంగ్ స్టార్స్ కంటే సీనియర్ స్టార్స్ చాలా బెటర్ అని అభిప్రాయపడుతున్నారు.