పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ విజయంతో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మంచి జోష్ లో ఉన్నారు. ఇక పై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్న ఈ బాలీవుడ్ బాద్షా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో దున్కి సినిమాలతో వరుస విజయాలను సాధించాలనే లక్ష్యంతో దూసుకు పోతున్నారు.
ఇప్పటికే భారీ బజ్ ఉన్న జవాన్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లనుంది. జూన్ 2న విడుదల కానున్న ‘జవాన్’ తో 6 నెలల్లోనే రెండుసార్లు బాలీవుడ్ సూపర్ స్టార్ ను మరోసారి వెండితెర పై చూడాలని ఆయన అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత మంచి అవుట్ పుట్ వచ్చేలా చూసుకోవాలని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, పబ్లిసిటీ విషయంలో హడావిడి చేయకూడదని వారు అనుకుంటున్నారట. అయితే ఇవి కేవలం ప్రాథమిక చర్చలు మాత్రమేనని, ఇంకా అధికారికంగా ఏదీ ధృవీకరించబడలేదన్నారు.
ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యామియో కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారని సమాచారం. మొదట ఈ పాత్రను అల్లు అర్జున్ కు ఆఫర్ చేయగా ఆయన తప్పుకున్నారు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో కనిపించనున్న జవాన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.