హీరోయిన్ శ్రుతిహాసన్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి యొక్క వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కాగా మంచు లొకేషన్లలో పాటల చిత్రీకరణ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యలను ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు చిన్న వివాదానికి దారితీశాయి.
పాటల కోసం మంచులో డ్యాన్స్ చేయడం తనకు నచ్చదని, ఇలాంటి పాటల చిత్రీకరణ సమయంలో హీరోలకు కోటులు, శాలువాలు వేస్తారని, కానీ హీరోయిన్లు బ్లౌజులు, చీరలు ధరించి డ్యాన్స్ చేయాల్సి వస్తోందని శ్రుతి తెలిపారు. అలాంటి పాట ఏదైనా చేశారా అని యాంకర్ అడగ్గా దానికి శ్రుతి ఇటీవలే ఓ పాటలో నటించాను అని చెప్పారు. అలా శృతి చెప్పగానే వాల్తేరు వీరయ్య సినిమాలోని శ్రీదేవి చిరంజీవి పాటకు సంబంధించిన వీడియో బైట్ కనిపించింది.
శ్రుతి చేసిన వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులకు రుచించకపోగా, సోషల్ మీడియాలో ఇతర తటస్థ ప్రేక్షకులు కూడా ఆమెను తప్పుబట్టారు. ఈ పాటలో నటించడానికి ముందు ఆమె అంగీకారం తెలిపి, ఇప్పుడు ఇలా ఫిర్యాదు చేస్తోన్నారని విమర్శిస్తున్నారు. ఫారిన్/స్నో లోకేషన్స్ లో మరో పాట చిత్రీకరణ సమయంలో షాట్ గ్యాప్ లో ఆమెకు జాకెట్ ఇచ్చారని కూడా కొందరు పేర్కొన్నారు. అయితే శృతి చెప్పిన దాంట్లో తప్పు ఏమీ లేదని, ఆమె అన్న మాటలు ఎవరినో నొప్పించడానికి కాదని, కేవలం తనకి ఆరోగ్యపరమైన సమస్యతో పాటు స్వతహాగా ఉదాహరించారు తప్ప ఆమెకు మరో ఉద్దేశ్యం లేదని కొందరు ఆమెను సమర్థించారు.
కేవలం చీర కట్టుకుని మంచులో సినిమాలు షూట్ చేయడం శారీరకంగా అసౌకర్యంగా ఉంటుందని, కానీ ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు కాబట్టి ఈ ట్రెండ్ కొనసాగుతుందని సినిమా విడుదలకు ముందే శ్రుతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో ఆన్నారు. ఆమె చెప్పిన విధానం వల్ల నెటిజన్లు చిరంజీవి, శ్రుతిహాసన్ ల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కథనాలు కూడా రాసేస్తున్నారు.
ఎందుకంటే వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు ముందు శ్రుతి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సహా సినిమాకి సంభందించిన ఈ ప్రమోషన్ ఈవెంట్ కు కూడా హాజరు కాకపోవడం, వీరసింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఆమె హాజరుకావడంతో శ్రుతి, చిరంజీవిల మధ్య విభేదాలు వచ్చాయనే టాక్ మొదలైంది. తాజాగా పైన చెప్పిన ఇంటర్వ్యూలో ఆమె వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఇలా మాట్లాడడం బట్టి.. చిరంజీవి, శ్రుతిహాసన్ ల మధ్య ఏమైనా సమస్యలున్నాయా అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతుంది.