ఈరోజుల్లో సినిమాను తెరకెక్కించడమే కాదు దాన్ని అంతే సమర్థవంతంగా ప్రచారం జరిపి సరైన విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది ఎంతో శ్రమతో కూడుకున్న పని. అలాగే ప్రస్తుతం ప్రేక్షకులు విడుదలైనఅన్ని సినిమాలూ చూసే మూడ్ లో లేనందున, ఫలానా సినిమాతో క్లాష్ అవకుండా సరైన విడుదల తేదీని కూడా చూసుకుని రిలీజ్ చేయాల్సి ఉంటుంది.ఇలాంటి ఎన్నో కష్టాలను మరియు సమస్యలను దాటుకుని కార్తికేయ 2 ఎట్టకేలకు ఆగస్టు 12న విడుదల కాబోతోంది.
చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. సినిమా రిలీజ్‌కు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది చిత్ర యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్‌కు హీరోయిన్ అనుపమ హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సడన్‌గా అనుపమ ప్రమోషన్స్‌కు ఎందుకు రాలేదు? హీరో నిఖిల్ తో ఏదైనా గొడవ జరిగిందా లేక పారితోషికం విషయంలో ఏమైనా అవకతవకలు జరిగాయా? వంటి ప్రశ్నలతో నెటిజన్లు రకరకాలుగా ఆలోచిస్తున్న సమయంలో ఈ వివాదం పై అనుపమ పరమేశ్వరన్ తన వైపు నుంచి వివరణ ఇచ్చారు.
కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్‌కు నేను ఎందుకు రాలేకపోతున్నానో మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. నేను కార్తీకేయ 2 కాకుండా మరో రెండు సినిమాల కోసం పగలనకా రాత్రనకా షూటింగులతో బిజీగా ఉన్నాను. ఇతర ఆర్టిస్టులతో కాంబినేషన్ సన్నివేశాలను ముందుగానే ఎప్పుడో షెడ్యూల్ చేశారు. మరో వైపు కార్తికేయ 2 ప్రమోషన్స్ కోసం నేను కూడా చాలా ప్లాన్ చేసుకున్నాను కానీ సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడటంతో షెడ్యూల్ మొత్తం తారుమారైంది. కాబట్టి ఇక్కడ వేరే సినిమాల షూటింగ్ లకు నేను హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. నా బాధను మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కార్తికేయ 2 టీమ్, మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్న నిఖిల్ గారికి నా ప్రేమాభివందనలు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం ఇచ్చారు అనుపమ పరమేశ్వరన్.
నిజంగానే కార్తీకేయ 2 సినిమాను ప్రచారం చేసే విషయంలో హీరో నిఖిల్ మరియు చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారు. ఇటీవలే ఇస్కాన్ టెంపుల్ లో సందడి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు అక్కడ తమ సినిమా యొక్క ట్రైలర్ ను ప్రదర్శించడం ద్వారా మంచి పబ్లిసిటీని దక్కించుకున్నారు. అలాగే సినిమా ప్రమోషన్ నిమిత్తం బాలీవుడ్ వరకు కూడా వెళ్ళారు. మరి వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా లేదా తెలియాలి అంటే ఆగస్టు 12 వరకూ ఎదురు చూడక తప్పదు.