బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా` ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు- తమిళం- హిందీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని అమీర్ ఖాన్ ఎంతో తపనతో ఉన్నారు. అంతే కాకుండా తెలుగులో కూడా ఎన్నో రకాల ప్రచారాలు చేస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. అయితే రకరకాల కారణాల వల్ల సినిమా పై ప్రేక్షకుల్లో రావాల్సిన క్రేజ్ అయితే రాలేదు అనే చెప్పాలి. ఈ చిత్రానికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున స్వయంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొని తమ వంతు సహాయం చేస్తున్నారు.ఇన్ని రకాలుగా సినిమాని ప్రజల్లోకి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా.. లాల్ సింగ్ చడ్డాకు పరిస్థితులు ఏమాత్రం సహకరించట్లేదు.
దీనికి తోడు ఇటీవల Boycott Laal Singh Chaddha అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ అవడం అమీర్ కు మరో సమస్యలా మారింది. దీని పై అమీర్ ఖాన్ స్పందించారు. అంతే కాదు తన సినిమాని నిషేధించవద్దని అందరూ సినిమాను చూడాలని ప్రేక్షకులని ఆయన అభ్యర్థించారు. ఇటీవల మీడియాతో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లాల్ సింగ్ చద్దా ట్విట్టర్ ట్రెండ్ పై స్పందించమని అమీర్ ని మీడియా ప్రతినిధులు కోరగా ఈ మొత్తం వివాదం పై అమీర్ తన ఆలోచనలను పంచుకున్నారు.
ఇలాంటి దుష్ప్రచారం జరగడం పట్ల చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఇలా నేను భారతదేశాన్ని ఇష్టపడను అని కొందరు అనుకుంటున్నారని, అది కూడా చాలా బాధగా ఉందని అన్నారు. కొంతమందికి అలా అనిపించడం చాలా దురదృష్టకరం అని అన్నారు.దయచేసి అలాంటి దుష్ప్రచారాన్ని నమ్మకండి. నా సినిమాని బాయ్కాట్ చేయకండి. దయచేసి నా సినిమా చూడండి అని అమీర్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.
#BoycottLaalSinghChaddha ట్రెండ్ అవుతుండగానే చిత్ర కథానాయిక కరీనా కపూర్ కి చెందిన ఒక పాత క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కరీనా నెపోటిజం గురించి మాట్లాడారు. వారసుల సినిమాలు మీకు నచ్చకపోతే చూడొద్దు.. మిమ్మల్ని ఎవరూ ఆ సినిమాలు చూడమని బలవంతం చేయలేదు కదా అంటూ ఆ వీడియోలో కరీనా అంటున్నారు.
అయితే ఈ సినిమా పై నెగటివ్ పబ్లిసిటీ జరగడం ఇదే మొదటిసారి కాదు. `లాల్ సింగ్ చడ్డా` ట్రైలర్ విడుదలయిన రోజు నుంచే వివాదాలు మొదలయ్యాయి అప్పట్లో భారతదేశం పై అమీర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అందుకు కారణం. అమీర్ ఖాన్ – కరీనా కపూర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` ఆగస్టు 11న విడుదల కానుంది.
2015లో భారతదేశంలో పెరుగుతున్న అసహనం గురించి చేసిన ఒక వ్యాఖ్య కారణంగా అమీర్ ఖాన్ వివాదాల్లో చిక్కుకున్నారు. “మన దేశం చాలా సహనంతో ఉంది.. కానీ చెడును వ్యాప్తి చేసే వ్యక్తులు ఉన్నారు“ అని అమీర్ వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అంతటితో ఆగకుండా.. ఆయన మాజీ భార్య కిరణ్రావు గురించి ప్రస్తావిస్తూ.. ఆమె తమ పిల్లల భద్రత కోసం దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందేమో అని అన్నట్లు చెప్పడంతో ప్రజలు తీవ్రంగా స్పందించారు.