టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 రెండు రోజుల క్రితం గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి ఫస్ట్ డే ప్రీమియర్స్ నుంచి మంచి సక్సెస్ టాక్ సంపాదించుకొని ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతుంది. అయితే ప్రీమియర్స్ ప్రదర్శన సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్లో రాత్రి 9:30 సమయంలో తన కుటుంబంతో కలిసి పుష్ప 2 మూవీ చూశారు అల్లు అర్జున్. ఆ సందర్భంలో ఆ థియేటర్ చుట్టుప్రక్కల ప్రాంగణంలో భారీ స్థాయి తొక్కిసలాటైతే జరిగింది.
దానితో ఒక మహిళ మరియు ఆమె కుమారుడు మృతి చెందారు. ఆ ఘటనతో ఇకపై పెద్ద సినిమాల స్పెషల్ షోస్ ని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిని ఆదుకుంటామంటూ నిన్న రాత్రి అల్లు అర్జున్ ఒక వీడియోని రిలీజ్ చేసి వారికి రూ. 25 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. అయితే ఈ దుర్ఘటనతో తను అండ్ పుష్ప 2 టీమ్ మొత్తం చాలా బాధపడ్డామని ఆ వీడియోలో చెప్పిన అల్లు అర్జున్ ఆ ఘటనకు ఆయన బాధితులకు క్షమాపణ అయితే చెప్పలేదు.
దానితో పలువురు అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయినా ఘటన జరిగి బాధితులు మరణించిన తరువాత మొక్కుబడిగా వీడియో రిలీజ్ చేసి పరిహారం అందించడం ఏమిటని, అతడిలో పశ్చాత్తాపం ఏ మాత్రం లేదని దుయ్యబడుతున్నారు. మొత్తంగా ఈ విషాద ఘటన టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది.