కార్తికేయ 2, సీతా రామం మరియు బింబిసార వంటి ఇటీవలి చిత్రాల భారీ విజయం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మళ్ళీ పూర్వ వైభవాన్ని తిరిగి పొందే దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఇతర టైర్-2 హీరోల పరిస్థితి మాత్రం అంతగా బాగోలేదు. వారి సినిమాలు అన్నీ వరుస ఫ్లాప్ లు అవుతున్నాయి. మరియు ఆయా సినిమాలను కొన్న పంపిణీదారులు ఇతర బయ్యర్లు నష్టాల బాటలో పయనించారు. ఆ కారణంగా ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్లకు భారీగా గండి పడనుంది.
నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, రామ్, నితిన్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రవితేజ మరియు అనేక మంది హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్‌లుగా నిలిచి అతి దారుణమైన దశలో ఉన్నారు. వారి గత కొన్ని చిత్రాలు అటు బాక్సాఫీస్ వద్ద, ఇటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి.
గత కొన్ని నెలల్లో, నాని నటించిన అంటే సుందరానికి అట్టర్ ఫ్లాప్ అవగా, విజయ్ దేవరకొండ హీరోగా భారీ ప్రచారంతో వచ్చిన లైగర్ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. అదే విధంగా, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మంచి సినిమా అనే ప్రశంసలు అందుకున్నా, బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం పరాజయం పాలయింది. గని ద్వారా వరుణ్ తేజ్ కూడా డిజాస్టర్ ఇచ్చారు. రామ్ నటించిన ది వారియర్ కూడా అదే ఫలితాన్ని పొందింది. నితిన్, రవితేజ కూడా వరుస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితిలో ఉన్నారు.
2021లో క్రాక్ వంటి భారీ విజయం సాధించిన తర్వాత, మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. అదే విధంగా, నితిన్ మాచర్ల నియోజకవర్గం మరియు రంగ్ దే సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. కాగా OTT లో విడుదలైన మాస్ట్రోని సినిమాకు చాలా మామూలు స్పందన వచ్చింది.
కరోనా తరువాత పరిస్థితి మారిపోయింది ఒకప్పటిలా ఓపెనింగ్స్ గ్యారంటీగా రావట్లేదు. ఇప్పుడు హీరో ఎవరైనా సినిమాకు సరైన టాక్ రాకపోతే, సింగిల్ డిజిట్ షేర్ తో ముగుస్తున్నాయి. దీంతో చాలా మంది హీరోలు రాబోయే తమ సినిమాలకు రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటున్నారు. ఈ హీరోలు తదుపరి చేసే సినిమాలు కూడా ఇలానే కొనసాగితే, పరిస్థితి మరింత దిగజారి హీరోలందరూ రెమ్యునరేషన్‌లు మళ్లీ తగ్గించాల్సి వస్తుంది.