తమ తాత, నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు పై నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు అక్కినేని ఫ్యామిలీ హీరోలు కౌంటర్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం వీర సింహా రెడ్డి సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ తాజా వివాదానికి కారణమయ్యారు.
ఈ వేడుకలో అభిమానులను అలరించేందుకు తన ప్రసంగంలో సరదాతనం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఆయన అక్కినేని నాగేశ్వరరావు పేరును తప్పుగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మా నాన్న ఎన్టీఆర్ కు సమకాలికులుగా నటులు రంగారావు (ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ), అక్కినేని, తొక్కినేని, మరికొందరు ఉండేవారు’ అని బాలకృష్ణ అన్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యలు లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అభిమానులకు రుచించలేదు. అలాగే ఇతర హీరోల అభిమానులు మరియు నెటిజన్లు కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలుగు సినిమాల్లో ఎన్టీ రామారావు గారికి సమకాలికులు ఏఎన్నార్ గారు. ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూపించారు. రెండు భాగాల బయోపిక్ గా తెరకెక్కిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్: మహానాయకుడు’లో తండ్రి పాత్రను బాలకృష్ణ పోషించడమే కాకుండా ఆ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు.
బాలకృష్ణ వ్యాఖ్యల పై ఏఎన్నార్ మనవడు నాగచైతన్య స్పందించారు. తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ”నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, ఎస్వీ రంగారావుగారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు.. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపర్చుకోవటం” అన్నారు.
చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా ఇదే సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకోగా, వారి తండ్రి, ఏఎన్నార్ కుమారుడు అయిన నాగార్జున మాత్రం ఈ ఘటన పై ఇంతవరకు స్పందించలేదు.