అఖిల్ ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ దశలో ఉండగా చాలా కారణాల వల్ల ఆలస్యమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో పలు హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లు, ఛేజింగ్స్ ఉంటాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ స్థాయి సినిమా ఇదే కావడంతో నిర్మాతలు సైతం ఎలాంటి ఖర్చు పెట్టి అయినా సరే బెస్ట్ అవుట్ పుట్ కోసం రాజీ పడకుండా నిర్మిస్తున్నారు.
2021 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ చిత్రం దాదాపు రెండేళ్ల చిత్రీకరణ తర్వాత చివరి దశకు చేరుకున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఒక్క మేజర్ యాక్షన్ సీక్వెన్స్ మినహా మిగతా షూటింగ్ భాగాలు అన్నీ పూర్తయ్యాయట.
ఈ యాక్షన్ బ్లాక్ ను ఫారిన్ లొకేషన్స్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆ షూటింగ్ ముగియగానే మార్చి నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్ ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్లకు చేరుకుందని, పాజిటివ్ బజ్ రావాలంటే మంచి టీజర్స్ తో సాలిడ్ ప్రమోషనల్ స్ట్రాటజీ అవసరమని అంటున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర అఖిల్ అక్కినేని ఏజెంట్ కి దిశా నిర్దేశం చేసేలా ఉంటుందట. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలవనుంది.