తమిళ సినిమాలకు సంక్రాంతి/పొంగల్ సీజన్ ను రెండు అతిపెద్ద పండుగ సీజన్లలో ఒకటిగా చెప్తుంటారు. సాధారణంగా ఈ పండగ పూట రెండు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి, ఈసారి తమిళ ఇండస్ట్రీలో టాప్ 2 హీరోలుగా ఉన్న తల అజిత్ మరియు దళపతి విజయ్ 2023 పొంగల్ బరిలో దిగుతున్నారు.
అభిమానులు ఇప్పటికే రెండు సినిమాల మధ్య పోలికలు ప్రారంభించారు. మరియు రెండు అభిమానుల మధ్య పోటీ పూర్తి స్థాయిలో ఉంది. రెండు సినిమాలు ఎన్ని స్క్రీన్లలో విడుదలవుతాయి అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా విజయ్ నటించిన వారిసు విషయానికొస్తే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో థియేటర్లు కొల్లగొట్టెందుకు సిద్ధంగా ఉంది.
అయితే హెచ్.వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటిస్తున్న తునివు చిత్రానికి తమిళనాడులో ఎక్కువ థియేటర్లు లభిస్తున్నాయని అంటున్నారు తునివుతో పోల్చితే తమిళనాడు కాకుండా ఇతర ప్రాంతాల్లో వారిసుకు ఎక్కువ థియేటర్లు లభిస్తున్నాయని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం తునివుకు ఎక్కువ థియేటర్లు లభిస్తున్నాయట.
ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ పిక్చర్స్ తునివు హక్కులను కొనుగోలు చేసింది. వారిసు టీమ్ మరియు రెడ్ జెయింట్ మధ్య చర్చలు జరిగాయి, కానీ ఒప్పందాలు అనుకున్నట్లు జరగలేదని తెలుస్తోంది. చివరికి ఈ సినిమా హక్కులు సెవెన్ స్క్రీన్ స్టూడియోకి వెళ్లాయి. రెడ్ జెయింట్ ప్రస్తుతం తమిళనాడులో అతిపెద్ద పంపిణీ సంస్థ. అందుకే వారిసు కంటే తునీవుకు ఎక్కువ థియేటర్లు పట్టుకుంటున్నారు.
దీంతో విజయ్ అభిమానుల్లో కాస్త ఒత్తిడి పెరుగుతోంది. వారి ప్రత్యర్థి అజిత్ చిత్రం మంచి నాణ్యత మరియు ఎక్కువ థియేటర్ల సంఖ్యని పొందుతోంది. ఈ కారణం వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యానికి దారి తీయవచ్చు అని వారు కాస్త ఆందోళన చెందుతున్నారు.
అయితే కంటెంట్ బ్యాడ్ గా ఉంటే ఎన్ని స్క్రీన్లు ఉన్నా.. ప్రేక్షకులు మంచి సినిమానే ఎంచుకుంటారు. కాబట్టి, మొదటి కొన్ని షోలు మరియు ఓపెనింగ్ డే కలెక్షన్స్ మినహా ఈ విషయాల వల్ల పెద్దగా ప్రభావం ఉండదనే చెప్పాలి. సినిమా భవితవ్యం పూర్తిగా దానిలో ఉన్న వినోదం మీద ఆధారపడి ఉంటుంది కానీ మరేదీ కాదు.