మాజీ విశ్వ సుందరి, ప్రముఖ సినీ నటి సుష్మితా సేన్ గుండెపోటుకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే ఇది జరిగినా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదీ ఆవిడ మాటల్లోనే బయటకి వచ్చింది. సుష్మితాకు గుండెలో నొప్పి రావటంతో.. వెంటనే ఆస్పత్రికి వెళ్లటం.. ఆ వెంటనే యాంజియో ప్లాస్టీ తీయంతో గుండెల్లో బ్లాక్స్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారట. ఆ పైన పరీక్షల అనంతరం స్టంట్స్ వేయటంతో ప్రాణాలతో బయటపడినట్లు తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా స్వయంగా వెల్లడించారు నటి సుష్మితా సేన్.
47 ఏళ్ల సుష్మిత ఒంటరిగా ఉంటున్నారు. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న ఆమె, తండ్రితో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ గుండెపోటుకు గురవ్వగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. సరైన సమయంలో సరైన చికిత్స అందటంతో ప్రాణాలతో ఉన్నానంటూ. సోషల్ మీడియా ద్వారా సుష్మితా సేన్ వెల్లడించారు. సుష్మితా సేన్ గుండెపోటుకు గురైన విషయం తెలియటంతో బాలీవుడ్ తో పాటు ఆవిడ అభిమాన గణం దిభ్రాంతికి గురైంది.
నిజానికి ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎంతో జాగర్తగా ఉంటారని ఆమెకి మంచి పేరుంది. అలానే ఫిట్ నెస్ విషయంలో కూడా ఎందరికో ఆదర్శంగా నిలిచారు సుస్మితాసేన్. అయితే, ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడటం ఇదే మొదటిసారి కాదు. తనకు అడిసన్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నట్లు ఆమె గతంలో వెల్లడించారు. 2014లో పరీక్షలు చేయించుకున్న ఆమె అప్పటి నుంచి స్టెరాయిడ్స్ పైనే ఆధారపడుతున్నారు.
ఆరోగ్య భయం తనను ఎలా కుదిపేసిందో, ఎంతకాలం తనను తాను నిలబెట్టుకోగలుగుతానో అని ఆలోచించేలా చేసిందని కూడా ఈ నటి రాశారు. తన తండ్రితో ఉన్న ఫోటోని పంచుకుంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఆమె తన సందేశాన్ని అందజేశారు.
సుస్మితా సేన్ తన హెల్త్ అప్డేట్ ను ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసిన వెంటనే, ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు. సుస్మితా సేన్ చివరిసారిగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ షో ఆర్య రెండవ సీజన్లో కనిపించారు. ప్రస్తుతం మూడో సీజన్ కోసం సన్నద్ధమవుతున్నారు.