‘శాకుంతలం’ సినిమా విడుదల తేదీకి నెల రోజుల ముందే హీరోయిన్ సమంత రుత్ ప్రభు తొలిసారిగా ‘శాకుంతలం’ సినిమా చూశారు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్, చిత్రబృందంతో కలిసి థియేటర్ నుంచి దిగిన ఫొటోను సమంత తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆమె చేసిన పోస్ట్ దర్శకుడిని ప్రశంసించడమే కాక, ఇప్పుడు సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
దర్శకుడు గుణశేఖర్ గారితో పాటు చిత్ర బృందానికి సమంత కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక అందమైన సినిమా! మన గొప్ప ఇతిహాసాలలో ఒకటైన ఈ కథ ఇంత మధురంగా జీవం పోసుకుంది! మా ఫ్యామిలీ ఆడియన్స్ పవర్ ఫుల్ ఎమోషన్స్ కి కొట్టుకుపోయే వరకు వెయిట్ చేయలేను. ఇక పిల్లలంతా… మీరు మా మాయా ప్రపంచాన్ని ప్రేమించబోతున్నారు! దిల్ రాజుగారు, నీలిమగారు… ఈ అద్భుతమైన ప్రయాణానికి ధన్యవాదాలు. శాకుంతలం సినిమా ఎప్పటికీ నా మనసుకు దగ్గరగా ఉంటుంది’ అని ఆమె తన నోట్ లో పేర్కొన్నారు.
ఆ ఫొటోలో దేవ్ మోహన్, సమంత, అల్లు అర్జున్ కూతురు చిన్న అల్లు అర్హతో ఉన్న స్క్రీన్ ముందు చిత్రబృందం నిలబడింది. ఈ చిత్రం చూస్తుంటే అది సినిమా యొక్క క్లైమాక్స్ షాట్ అని అర్థం అవుతోంది.
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన కాళిదాసు సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 3డిలో కూడా విడుదల కానున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ తో కలిసి నీలిమ గుణ నిర్మించారు.
సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో దుష్యంత్ పాత్రలో దేవ్ మోహన్ నటించగా.. ప్రిన్స్ భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటిస్తోంది. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధూ, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూర్చారు.