ఇటీవలే, స్టార్ హీరోయిన్ సమంత తాను బాధపడుతున్న మైయోసైటిస్ యొక్క అరుదైన వైద్య పరిస్థితి గురించి అందరికీ తెలిపింది. ఆమె పరిస్తితి ఇప్పుడు బాగానే ఉంది మరియు వ్యాధి తాలూకు ప్రభావం నుండి కోలుకుంటుంది. అయితే తాజాగా మరో అరుదైన వైద్య పరిస్థితితో మరో నటి బాధ పడుతున్నారు.
ఆ నటి మరెవరో కాదు పూనమ్ కౌర్.. ఈ నటి ఫైబ్రోమైయాల్జియా అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిలో కండరాల నొప్పిని కలిగిస్తుంది.
నవంబర్ 12వ తేదీన పూనమ్‌కు వెన్నునొప్పి వచ్చిందని, అదే రోజు ఆమెను కేరళలోని ఆసుపత్రికి తరలించారని మీడియా కథనం. ఆమె ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్నట్లు వైద్య బృందం తర్వాత గుర్తించబడింది.
ఫైబ్రోమయాల్జియా అనే అరుదైన వ్యాధితో పూనమ్ కౌర్ బాధపడుతున్నారని.. దీనికి కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. రెండేళ్లుగా ఆమె ఈ వ్యాధితో బాధపడుతున్నారని.. ప్రస్తుతం కేరళలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
అయితే, ప్రస్తుతం పూనమ్ కౌర్ ఆరోగ్యం నికలడగా ఉందట. ఆమె ఇప్పుడు కేరళలలో లేరని మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటున్నారని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న స్పష్టం చేశారు.
ఈ మేరకు పూనమ్ కౌర్ ఆరోగ్యం గురించి వివరాలు వెల్లడిస్తూ గురువారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. “గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న పూనమ్ కౌర్ నవంబర్ 10వ తేదీన మాతో కలిసి సూరత్ గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టీ పన్ను ఎత్తివేయాలని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం 12వ తేదీ ఢిల్లీలో జరిగిన బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆమెకు వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో ఆమెకు 18వ తేదీన ఫైబ్రో మయాల్జియా నిర్ధారణ అయ్యింది. కేరళలో చికిత్స అనంతరం ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె పూర్తి ఆత్మిశ్వాసంతో ఉన్నారు’’ అని జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న పేర్కొన్నారు.
సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 2006లో తెరకెక్కించిన ‘మాయాజాలం’ సినిమాతో పూనమ్ కౌర్ తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక విచిత్రం’ సినిమాలో నటించారు.
అయితే, గోపీచంద్ హీరోగా వచ్చిన ‘శౌర్యం’ సినిమాతో పూనమ్ కౌర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో గోపీచంద్‌కు చెల్లెలిగా పూనమ్ నటించారు. ఆ తరవాత తెలుగు, తమిళంలో వరుసగా పలు చిత్రాల్లో నటించారు. అయితే, సినిమాల్లో కనిపించిన దాని కన్నా వివాదాలతోనే పూనమ్ కౌర్ బాగా పాపులర్ అయ్యారు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి త్వరలోనే పూర్తిగా మెరుగవ్వాలని కోరుకుందాం.