బాలనటిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన మీనా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పరిశ్రమని ఏలింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మదర్ క్యారెక్టర్స్, సీనియర్ హీరోల పక్కన చేస్తూ బిజీ బిజీగా ఉంది. 2009లో మీనాకు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న విద్యాసాగర్ తో వివాహం జరిగింది. పెళ్లి అయి పాప పుట్టిన తర్వాత కొన్నేళ్లు సినిమాలకి బ్రేక్ తీసుకున్నా ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయింది. మీనా పాప నైనిక కూడా ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా చేసిన తేరి మూవీలో నటించింది.
అలాంటి ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన,చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.ఆస్పత్రి వర్గాలు చెప్పిన దాని ప్రకారం,నటి మీనా భర్త విద్యాసాగర్ కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఆ సమయంలో కరోనా నుంచి మిగతా సభ్యుల ఆరోగ్యం కోలుకున్నప్పటికీ, విద్యాసాగర్ అనారోగ్యం మాత్రం క్షీణించింది. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో ఊపిరితిత్తుల మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అప్పటి నుంచి ఎంజీఎం ఆస్పత్రితో చికిత్స తీసుకుంటున్నారు. అయితే సరైన సమయానికి విద్యాసాగర్‌కు సరిపోయే ఊపిరితిత్తులు దొరకలేదు. దీంతో లంగ్స్ ట్రాన్స్‌ప్లంటేషన్ కుదరలేదు. ఈ క్రమంలో రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించిన విద్యాసాగర్ బుధవారం తుదిశ్వాస విడిచారు.
విద్యాసాగర్ మృతిపట్ల టాలీవుడ్, కోలీవుడ్, ఇతర చిత్రపరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. నటి మీనా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.