తెలుగు సినీ నటుడు జగపతి బాబు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. దీనిని ఆ కుల(కమ్మ) ప్రజలు అంగీకరించడం లేదు సరి కదా, జగపతి బాబు చేసిన వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు 15 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఓ సినిమా ప్రమోషన్ కోసం ఆయన విజయవాడలోని సిద్ధార్థ కాలేజీకి వెళ్లారు. ఆ సందర్భంగా కులానికి వ్యతిరేకంగా మాట్లాడతానని ప్రిన్సిపాల్ కు చెప్పడంతో.. తను ఒక్కడేనని, కుల పిచ్చోల్లుగా 2000 మంది విద్యార్థులు ఉన్నారని, అలా మాట్లాడొద్దని ప్రిన్సిపాల్ హెచ్చరించారని ఆయన తెలిపారు.
కులానికి వ్యతిరేకంగా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కలిసి కొట్టే ప్రమాదం ఉందని ప్రిన్సిపాల్ తనతో చెప్పారని జగపతిబాబు తెలిపారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఈ వీడియో బైట్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జగపతిబాబు చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరు. జగపతిబాబు రాజకీయాలకు అతీతంగా, కులంతో సంబంధం లేకుండా ఉండాలనుకుంటే పర్వాలేదని వారు అంటున్నారు. ఒక ప్రముఖ నటుడిగా ఆయనకు కులం పట్ల పిచ్చి లేకపోతే మంచిదే కానీ ఒకరకంగా ఆయన కూడా తెలిసో తెలియకో తమ సమాజాన్ని కించపరుస్తూ, దానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వారు అంటున్నారు.
వారి మాటల్లోనూ న్యాయం ఉంది కదా. నిజానికి కమ్మ సామాజికవర్గంతో సహా అన్ని వర్గాలు కూడా కుల తీవ్రవాదంతో పోరాడుతున్నాయి. ఇటీవల పరిస్థితులు కాస్త చక్కబడినప్పటికీ ఇంకా ఆ సమస్య కొనసాగుతూనే ఉంది. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఒక సామాజికవర్గం మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా దూరం చేసి, అపఖ్యాతి పాలు చేయడం తప్పే కదా.
అకారణంగా కమ్మ సామాజికవర్గంలోని ప్రజలను కించపరుస్తూ ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ఈ ప్రచారం చూసి ఈ కుల తీవ్రవాదం, ద్వేషంలో భాగం కాని ఆ వర్గంలోని ఇతర వ్యక్తులు మాత్రం తీవ్రంగా కలత చెందుతున్నారు.
మొత్తం మీద 15 నుంచి 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను జనరలైజ్ చేయడంలో జగపతిబాబు తప్పు చేసినట్లు కనిపిస్తుంది. అప్పటి కాలం నాటి పరిస్థితులకు, అనుభవాలకు ఇప్పుడు విలువ ఉందో లేదో ఆయన ఆలోచించి ఉంటే అసలు ఎలాంటి సమస్య ఉండేది కాదు.