సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమాలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల విడుదలకు ఇంకా రెండు వారాలే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు విజయ్ యొక్క వారిసు / వారసుడు మరియు అజిత్ యొక్క తునివు / తెగింపుతో పోటీ పడనున్నాయి.
జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య విడుదల కానున్నాయి. ‘వారిసు’, ‘తునివు’లకు దిల్ రాజు సపోర్ట్ ను పరిగణనలోకి తీసుకుంటే బాలయ్య, చిరంజీవి సినిమాలకి ఏ స్క్రీన్ లు దొరుకుతాయోనని అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
అందుకే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు 6 షోలకు అనుమతి తెచ్చుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వారు భావిస్తున్నారట. అలానే తెలంగాణలో కూడా పండగ రోజుల్లో స్పెషల్ షోలకు పర్మిషన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట.
వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర స్క్రీన్ టైమ్ దాదాపు నలభై నిమిషాలు ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, రవితేజ సరసన కేథరిన్ థ్రెసా నటిస్తున్నారు.
వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణతో పాటు కన్నడ నటుడు దునియా విజయ్ కూడా ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. నటి హనీ రోజ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.