స్టార్ హీరోయిన్ సమంత.. ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని నాగచైతన్యతో ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విడాకుల వ్యవహారాన్ని వారిద్దరి అభిమానులు అంత సులువుగా ఒప్పుకొలేక పోయారు. ఇక విడాకుల ప్రకటన తర్వాత సమంత వ్యక్తిత్వం పై అనేక రకాల పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆమె ప్రవర్తన నచ్చకపోవడం వల్లే, చైతన్య ఆమెతో కలిసి ఉండలేక విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని.. సమంత వ్యక్తిగత జీవితంపై తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
దీంతో సమంతను ట్రోల్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం ఒక ట్రెండ్ గా మారిపోయింది కొన్ని రోజుల వరకు.. ఇక ఈ నెగటివ్ పబ్లిసిటీ పై గతంలోనే స్పందించారు సమంత. పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఆమెకు కాస్త సమయం ఇవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా కోరారు.ఇక ఆ తర్వాత తన కెరీర్ పై దృష్టి సారించి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు సమంత.
ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఇటీవలే కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంకు సమంత హాజరయ్యారు. ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది.
ఈ షోతో ఫిల్మ్ మేకర్‌గానే కాకుండా మంచి హోస్ట్‌గా కరణ్ జోహార్ నిరూపించుకున్నారు. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 7వ సీజన్ ను ఈమధ్యనే ప్రారంభించారు కరణ్ జోహార్.ఇందులో భాగంగానే సమంత తన ఎపిసోడ్‌లో పెళ్లి పై కొన్ని వ్యాఖ్యలు చేశారు.
కరణ్ జోహార్‌ను ఉద్దేశించి.. ‘ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం’ అని సమంత అన్నారు. దానికి ‘నేనేం చేశాను’ అని కరణ్ అడగ్గా.. ‘పెళ్లి చేసుకుంటే జీవితం కబీ ఖుషి కబీ ఘమ్ (K3G) సినిమాలా ఉంటుందని స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజ జీవితంలో మాత్రం అది KGF లా ఉంటుంది అని సమంత సెటైర్ వేశారు.
ఇక ఇదే క్రమంలో కరణ్ నాగ చైతన్య గురించి అడుగుతూ నీ భర్త అన్నప్పుడు సమంత మాజీ భర్త అనడం కాస్త వివాదాస్పదం అయింది. ఇక విడాకుల సమయంలో సమంత పై వచ్చిన ట్రాలింగ్ గురించి కూడా కరణ్ ప్రశ్నలు అడిగారు.అందుకు బదులుగా సమంత స్పందిస్తూ మొదటి నుంచీ తాను ప్రేక్షకుల వద్ద తన జీవితం గురించిన ఏ విషయం కూడా దాచలేదని, అందుకే తన పై వచ్చిన పుకార్లు మరియు వ్యక్తిగత ఖననం పై సరైన విధంగా స్పందించ లేకపోయానని ఆమె అన్నారు. ఇక విడాకుల తరువాత తనను అభిమానించే ప్రేక్షకులకి మాత్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, అయితే విడాకుల విషయంలో మాత్రం తన దగ్గర సరైన సమాధానం లేకుండా పోయిందని, ఆ పరిస్థితుల నుంచి కొద్ది రోజుల సమయం తీసుకున్నాకనే తాను ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నానని సమంత తెలిపారు.