తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 మరియు ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు రెండూ కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే దానికంటూ ఒక బ్రాండ్ వాల్యూ ఏర్పడింది. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో ఒకరైన మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తుండడం వల్ల ఆ సినిమా మరో సంచలనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా స్క్రిప్టుకు సంబంధించి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పలు రకాల కథలను, నేపధ్యాలను పరిశీలిస్తూ చాలా జాగర్తగా మొత్తం వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. అంతే కాదు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విదేశాలలో భారీ విజువల్ స్టూడియోస్ లను కూడా సినిమా మేకింగ్ లో ఇన్వాల్వ్ చేయడానికి రాజమౌళి విదేశాలకు వెళ్లారట. అడవి నేపథ్యంలో ( Forest Adventure Backdrop) ఈ సినిమా తేరకెక్కనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తాజాగా కొన్ని వార్తలు వచ్చాయి.
ఈ సినిమా షూటింగ్ 2023 ఆగస్ట్ ముందు మొదలవుతుందని సమాచారం. మూడేళ్ల పాటు జరగనున్న ఈ షూటింగ్ లో టాకీ పార్ట్ తో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ కు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని 2026 లో విడుదల చేసే సన్నాహాల్లో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఆ మూడేళ్లలో మహేష్ పూర్తిగా రాజమౌళి దగ్గరే లాక్ అయిపోతారు అన్నమాట. ఈ చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్ తో పాటు కళ్ళు చేదిరే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని అంటున్నారు. రాజమౌళి సినిమా అంటేనే ఉద్వేగభరితమైన ఫైట్లకు పెట్టింది పేరు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆ విభాగంలో మరింత అత్యున్నత స్థాయికి వెళ్ళారు. మరి మహేష్ తో చేయబోయే సినిమాలో ఇంకెంత అద్భుతంగా ఫైట్లని తెరకెక్కిస్తారో చూడాలి.