వెబ్ సిరీస్ – పరంపర సీజన్ -2
నటీనటులు: జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్, ఇషాన్, నైనా గంగూలీ, దివి తదితరులు.
దర్శకత్వం – కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల
నిర్మాతలు – ఆర్కా మీడియా వర్క్స్
సంగీతం – నరేష్ కుమారన్
కెమెరా – SV విశ్వేశ్వర్
రిలీజ్ డేట్ – 21 జూలై, 2022
ఓటీటీ ప్లాట్ ఫామ్ – డిస్నీ + హాట్ స్టార్ (Disney+Hotstar)
రేటింగ్ – 3/5
పరంపర వెబ్ సిరీస్ మొదటి సీజన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో హాట్‌స్టార్ (Disney+Hotstar) విడుదలై, తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. ఈ నెల 21న అంటే నిన్నటి నుంచి పరంపర 2వ సీజన్ ఇప్పుడు అదే ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతుంది.
ఈ సిరీస్ లో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర మరియు ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఇంత మంది ప్రతిభావంతులు నటించిన ఈ సీరీస్ అంచనాలను అందుకుందా లేదా చూద్దాం.
కథ: గోపితో రచనకు ఉన్న సంబంధం గురించి నాయుడుకి నిజం తెలియడంతో సీజన్ 1 ముగుస్తుంది. నాయుడు గోపిని అరెస్ట్ కూడా చేయిస్తాడు. సురేష్ ఈ సందర్భాన్ని రచనను దగ్గరవడానికి వాడుకుంటాడు. నిస్సహాయంగా ఉన్న గోపి తండ్రి మోహన్ రావు, తన కొడుకుని ఇంటికి ఎలాగైనా తిరిగి రప్పించి, అన్నీ చక్కదిద్దాలని ప్రయత్నిస్తాడు. కాని నాయుడు తన తండ్రికి చేసిన అన్యాయానికి ప్రతీకారం తీసుకోవాలనే కసితో ఉన్న గోపి, అతనిని అధికారం నుండి తొలగించి, తన తండ్రిని ఆ స్థానంలో చూడాలనుకుంటాడు. మరి ఈ చదరంగంలో ఎవరు ఎలాంటి ఎత్తులు వేసారు? గెలుపోటములు ఎవరివి అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ: కుటుంబ రాజకీయాల నేపథ్యంలో ఉన్న ఈ వెబ్ సిరీస్ కథ, 2010 లో విడుదలైన ప్రస్థానం కి కాస్త దగ్గరగా ఉంటుంది. పాత్రల పరిచయాలు, వాటి ఆశయాలు అన్నీ మొదటి సీజన్ లోనే చూపించేసారు. ఇలా రెండో సీజన్ లో ప్రేక్షకులు ఆశించింది ప్రతీకార పోరునే కాబట్టి అందుకు అనుగుణంగానే కథనం నడిచేలా చూసుకున్నారు దర్శకులు.
మొదటి సీజన్ లో నాయుడు ముందు ఓడిపోయి నీరుగారిపోయిన గోపీ పాత్ర ఈ సీజన్ లో ప్రతి దశలోనూ సమఉజ్జిగా నిలబడటం ఆకట్టుకుంది. అలాగే గోపి – రచనల మధ్య ఉన్న డ్రామా కూడా బాగా వచ్చింది. ఇక తను ఇచ్చిన మాటకు, తండ్రి మీద ఉన్న గౌరవంతో కుటుంబానికి విధేయుడుగా ఉంటూ వచ్చిన మోహన్ రావు పాత్ర కూడా రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మలిచారు.
కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదించినా, పాత్రల మధ్య ఉన్న సంఘర్షణ బాగా పండడం వల్ల ఆ బోర్ అన్న ఫీల్ రాకుండా ఉండింది. ఐతే బలమైన భావోద్వేగాలు ఉండాల్సిన చోట్ల కొన్ని సన్నివేశాలు మరీ సాధారణంగా ఉండడం, ముఖ్యమైన మలుపులు మూస ధోరణిలో ఉండడం మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు.
మొత్తం మీద రాజకీయ చదరంగం నేపథ్యంలో ఉన్న ఈ ఆధిపత్య పోరును వీలయినంత వరకూ ఆసక్తికరంగానే తెరకెక్కించారు అని చెప్పొచ్చు.
నవీన్ చంద్ర నటుడిగా మరోసారి తన సత్తా చూపించారు. ఇక జగపతి బాబు తన అనుభవం అంతా రంగరించి పాత్రను రక్తి కట్టించారు. ప్రధాన విలన్ పాత్రలో శరత్ కుమార్ మునుపటి సీజన్‌లో లాగానే నటనలో తనదైన ముద్ర వేశారు. ఆకాంక్ష సింగ్ పాత్రకి ఈ సీజన్ లో ప్రాధాన్యత పెరిగింది, ఆమె నటనా ఆకట్టుకుంటుంది. ఆమని, కస్తూరి, ఇషాన్ తదితరులు పాత్రలకు న్యాయం చేసారు.