చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా “కార్తికేయ-2”. గతంలో నిఖిల్ – చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చి హిట్‌గా నిలిచిన కార్తికేయ సినిమా సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నిజానికి కార్తికేయ 2 సినిమాను గత ఏడాదే విడుదల చేయాల్సి ఉన్నా, కరోనా వేవ్స్ కారణంగా షూటింగ్ దశలోనే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని జులై 22న విడుదలకు సిద్ధం అయింది.
అయితే నాగ చైతన్య “థాంక్యూ” సినిమా జులై 8 నుంచి జూలై 22 తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో.. కార్తికేయ 2 ఆగస్టు నెలకు పోస్ట్ పోన్ అయినట్లు ఇటీవలే చిత్ర బృందం తెలిపారు.
అయితే ఆగస్ట్ నెలలో బింబిసార, సీతారామం, మాచెర్ల నియోజక వర్గం, తమిళ హీరో విక్రమ్ నటించిన “కోబ్రా” తో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ” లాల్ సింగ్ చద్ధా” వంటి ఎన్నో సినిమాలు విడుదల అవుతున్నాయి.ఇన్ని సినిమాల విడుదల అవుతున్న నేపథ్యంలో కార్తికేయ 2 కూడా మధ్యలో వస్తే ఖచ్చితంగా పోటీ పడి ఇతర చిత్రాల వల్ల ప్రభావం పడుతుంది. అందుకని ఆ రద్దీలో విడుదల చేయడం కన్నా సెప్టెంబర్ లో సినిమాని విడుదల చేస్తే మంచిదనే భావనలో చిత్ర బృందం ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఐతే ఆ పుకార్లు తప్పని, కార్తీకేయ 2 ఆగస్టులో ఖచ్చితంగా విడుదల అవుతుందని సమాచారం. అయితే ఆ తేదీ ఆగస్ట్ 5 కాదు ఆగస్ట్ 12 అని తెలియవచ్చింది. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ 12 వీకెండ్ అంటే సాధారణంగా సినిమాలకు బాగా కలిసి వచ్చే రిలీజ్ డేట్ గా చెప్పుకుంటారు.
నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా కార్తికేయ. ఆ సినిమాకు దీటుగా కార్తికేయ 2 తెరకెక్కించినట్లు పోస్టర్లు, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వీటికి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన రావడమే కాక సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. నిఖిల్ ఖచ్చితంగా కార్తికేయ 2 తో విజయం సాధిస్తాడని ట్రేడ్ వర్గాల్లో కూడా నమ్మకం ఉంది. గత కొంతకాలంగా తెలుగులో సరైన సినిమా లేని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నారు.