దర్శకుడు కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ పైన దర్శకుడుగా మారిన ఆయన కెరీర్ లో దాదాపు అన్ని హిట్ సినిమాలే.. ఇటీవల విడుదలైన ఆచార్య సినిమా తప్ప. రచయితగా ‘భద్ర, మున్నా, నిన్న నేడు రేపు, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు పని చేసి ‘మిర్చి’తో దర్శకుడుగా మారారు కొరటాల శివ. ఈ సినిమా ఘన విజయం తరువాత ఇక ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది.ఆ తర్వాత ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను’ సినిమాలతో పరిశ్రమలో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఇన్ని విజయాలు ఉన్న కొరటాలను ఒకే ఒక్క సినిమా అటు దర్శకుడు గాను, ఇటు ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతీసింది. అదే ‘ఆచార్య’.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన “ఆచార్య” సినిమా నిర్మాణం దాదాపు రెండేళ్ళ పాటు సాగింది. ఇక ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలే కాకుండా వ్యాపార వ్యవహారాల్లో కూడా భాగం అయ్యారు కొరటాల శివ. అదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది అంటున్నారు సినీ వర్గాలు.
“ఆచార్య” సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. దీంతో అన్ని ఏరియాల నుంచి పంపిణీదారులు నష్టపోయిన మొత్తాలను చెల్లించాలని కొరటాల పై వత్తిడి తెచ్చారట. ఇక ఈ వ్యవహారాలను తన స్నేహితుడు సుధాకర్ తో కలిసి కొరటాల శివ చాలా వరకు సెటిల్ చేశారని తెలిసింది
అయితే సీడెడ్ ఏరియాకు సంబంధించిన వ్యవహారం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదట. తాజాగా ఈ ఏరియాలో పంపిణీ చేసిన అభిషేక్ తో పాటు ఎగ్జిబిటర్స్ తమ డబ్బు చెల్లించాలని కొరటాల ఆఫీస్ కు వెళ్ళి వత్తిడి చేశారట. ఈ విషయంలో కొరటాల సన్నిహితుడు, మరియు మైత్రీ అధినేత నవీన్ సర్దుబాటు చేయాలని ప్రయత్నించినా ఆ చర్చల సఫలం కాలేదట. కొరటాల నేరుగా వచ్చి హామీ ఇస్తే కానీ సమస్య పరిష్కారం కాదంటున్నారు. ఒక వేళ తమకు న్యాయం జరగకుంటే మెగాస్టార్ చిరంజీవి వద్దకు పంచాయితీ తీసుకువెళతామని ఎగ్జిబిటర్లు చెప్పినట్లు సమాచారం. అయితే చివరికి ఈ వ్యవహారం దాదాపు ఆరు కోట్లకు సెటిల్ అయిందని తెలిసింది.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. అజ్ఞాతవాసి వంటి భారీ డిజాస్టర్ సినిమాలకు ఆయా నిర్మాతల వద్దకు నష్టపోయిన బయ్యర్లు వెళ్ళారు కానీ హీరో దగ్గరకో లేదా దర్శకుడి దగ్గరకో వెళ్లలేదు. దర్శకులు తమ పని తాము చేసుకుంటే అలాంటి ఇబ్బందులు ఎదురుపడవు. అయితే కొరటాల శివ ఇలా సినిమా వ్యాపార లావాదేవీల్లో భాగం కావడం ఇదేమి కొత్త కాదు. గతంలో మహేష్ బాబు నటించిన “భరత్ అనే నేను” సినిమాకి కూడా ఆయన ఒక ఏరియా డిస్త్రీబ్యూషన్ హక్కులను తన పారితోషికంగా తీసుకున్నారు. ఇక జనతా గారేజ్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ ను కొరటాల శివ సన్నిహితుడు అయిన సుధాకర్ చూసుకున్నారు.